ఆనకట్ట పిల్లర్లపై దూకుతూ స్కూల్‌కు వెళ్తున్న పిల్లల వీడియో వైరల్ అయిన తరువాత అక్కడ ఏం మారింది

ఫొటో సోర్స్, Naved Jafri
- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో కొంతమంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి బేతవా నదిపై ఉన్న స్టాప్ డ్యామ్ పిల్లర్స్‌పై ప్రమాదకరంగా దూకుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విదిశ జిల్లాలోని పలోహ్ గ్రామంలో స్కూల్ విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ డ్యామ్‌ను దాటుతున్న వీడియో వెలుగుచూసిన తర్వాత, స్థానిక యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగాయి.
అధికారులు ఇప్పుడు ఆ డ్యామ్ మీద ఐరన్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు.
అదనంగా, గ్రామంలోనే తొమ్మిది, పదో తరగతులు కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలో పై తరగతుల్లో చదవడానికి ఈ నదిని దాటాల్సివచ్చిన పిల్లలను ఇప్పుడు సమీపంలోని బందేరా గ్రామంలోని హైస్కూల్లో చేర్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
అయితే బీబీసీ బృందం ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు.. ఈ వీడియో వారం కిందట వైరల్ అయినప్పటికీ అక్కడి పిల్లలు గత ఏడెమినిదేళ్లుగా ఇలా ప్రాణాలను పణంగా పెట్టి స్కూలుకు వెళ్తున్నారని గ్రామస్తులు, విద్యార్థులు తెలిపారు.


ఫొటో సోర్స్, Naved Jafri
రాష్ట్ర ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
జూలై 7న ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరంగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా గత బుధవారం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. జిల్లా యంత్రాంగం స్థానిక అధికారుల నుంచి ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ తెప్పించి, పిల్లలు సురక్షితంగా స్కూలుకు వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఈ చర్యలు చేపడుతుండగానే బీబీసీ ఆ ప్రాంతానికి వెళ్లినపుడు స్కూలుకు వెళ్లడానికి డ్యామ్‌ను దాటిన చాలా మంది విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.
11వ తరగతి విద్యార్థి దేవ్ శర్మ స్టాప్ డ్యామ్ ఒడ్డున నిలబడి ఏడాది క్రితం తాను నదిని దాటాల్సివచ్చిన స్కూల్ రోజులను గుర్తు చేసుకున్నారు.
"నేను కూడా ఈ హైస్కూల్లోనే తొమ్మిది, పదో తరగతులు చదివాను. అప్పట్లో నేను కూడా బడికి వెళ్లడానికి ఈ డ్యామ్ పిల్లర్ల మీద నుంచి దూకేవాడిని. నేను సుమారు నాలుగు అడుగుల దూరం దూకాల్సి వచ్చేది," అని చెప్పాడు.
విదిశా ఎస్‌డీఎం క్షితిజ్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ, "ఈ విషయమై ఇంతకుముందు మాకు ఎలాంటి సమాచారం లేదు. వీడియో వెలుగుచూసిన తర్వాత, మేం ఆ పిల్లలను సమీపంలోని బందేరా గ్రామంలోని హైస్కూల్లో చేర్పించాం" అని తెలిపారు.
"అవసరమైనప్పుడు గ్రామస్తులు, పిల్లలు దీనిని సురక్షితంగా దాటడానికి వీలుగా స్టాప్ డ్యామ్‌పైన ఐరన్ రెయిలింగ్ కూడా ఏర్పాటు చేశాం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Vishnukant Tiwari
'ఏళ్ల నుంచీ మా ప్రాణాలను పణంగా పెడుతున్నాం'
కానీ ఈ కథ ఇక్కడితో ముగిసేది కాదు.
వైరల్ వీడియోలో కనిపించిన విద్యార్థుల్లో కేశవ్ గుర్జర్ కూడా ఉన్నాడు. 10వ తరగతి చదువుతున్న అతడు డ్యామ్‌కు కిలోమీటరు దూరంలో 11వ తరగతి చదివే దేవ్ శర్మ ఇంటికి ఎదురుగా నివసిస్తారు.
నువ్వు కూడా ఆ వీడియోలో ఉన్నావా అని మేం అతడిని అడిగితే?
అతడు "అవును, నేను కూడా ఆ వీడియోలో ఉన్నా. నేను కాకుండా, నలుగురు అమ్మాయిలు ఉన్నారు, మిగిలిన వాళ్లంతా అదే స్కూల్ విద్యార్థులు. మేము స్కూలుకు వెళ్తుంటే ఎవరో ఆ వీడియో తీశారు," అని చెప్పాడు.
పిల్లలు అంత ప్రమాదకరమైన మార్గంలో ఎందుకు వెళ్తారని అడిగితే, అమాయకంగా ముఖం పెట్టిన కేశవ్ "తప్పలేదు భయ్యా" అన్నాడు.
"మేం రోడ్డు మార్గంలో వెళితే, సుమారు 15 కిలోమీటర్లు వెళ్లి, 15 కిలోమీటర్లు తిరిగి రావాలి. అంత దూరం సైకిల్‌పై వెళితే చదువెలా సాగుతుంది?" అంటాడు కేశవ్.
ఒకవేళ సైకిల్‌కి ఏదైనా రిపేరు వస్తే, ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే, సమయం ఆదా చేయడానికి మేం డ్యామ్ పిల్లర్స్ దాటుకుంటూ వెళ్లేవాళ్ళం అన్నాడు.
ఇది కేవలం తమ తరం కథ మాత్రమే కాదని అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని బందేరా గ్రామానికి చెందిన రిచా గిరి గోస్వామి చెప్పారు.
"మా అన్నలు, అక్కలు, వాళ్ళ ముందు తరాల వాళ్లు కూడా ఈ దారిలోనే వెళ్తూ వచ్చారు. సుమారు 10-12 సంవత్సరాలుగా అందరూ ఈ డ్యామ్ దాటుకునే స్కూలుకు వెళ్లేవారు"
"ఒక వైరల్ వీడియో ద్వారా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఈ దారి.. మాకు రోజువారీ జీవితం లాంటిది. మాకంటే ముందు చదువుకోవడానికి వెళ్లిన వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉండేది" అని రిచా అన్నారు.
మిడిల్ స్కూల్ తర్వాత హైస్కూల్ చదువు తమకు చాలా పెద్ద సమస్యగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆ సమయంలో పాలోహ్‌లో హైస్కూలు లేదు.. పిల్లలు విదిశా టౌన్‌కు వెళ్లడం లేదంటే బేతవా నదికి అవతల ఉన్న స్కూల్లో చేరడమో చేయాల్సి వచ్చేది.
తమ కుటుంబం సెకండ్ ఆప్షన్ ఎందుకు ఎంచుకుందో కేశవ్ తండ్రి తరూవర్ సింగ్ గుర్జర్ వివరించారు.
"ప్రధాన సమస్య ఏంటంటే, మిడిల్ స్కూల్ తర్వాత పిల్లలు పై తరగతుల కోసం విదిశాకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లాలంటే, ముందు రైల్వే లైన్‌ను దాటి, ఆ తర్వాత రెండు హైవేలను కూడా దాటాల్సి వచ్చేది."
"మా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించే స్తోమత మాకు లేదు. అందుకే, ఆ స్కూలుకు వెళ్లాలంటే డ్యామ్ పిల్లర్ల పైనుంచి దూకుతూ నదిని దాటాలని తెలిసినా, బేతవా నదికి అవతల ఉన్న పాలోహ్ హైస్కూల్లో మా పిల్లలను చేర్పించాము." అన్నారు.
ఈ సమస్యను గతంలో కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Lochan Mali
'గత సర్పంచులు ఏం చేయకపోవడంతో... '
తమ గ్రామ సర్పంచ్, ఎస్‌డిఎం, ఇతర అధికారులు అందరి ముందూ విద్యార్థి దేవ్ శర్మ తమ సమస్య గురించి మాట్లాడాడు.
"పిల్లలు దూకకుండా ఉండేందుకు ఇక్కడ రెయిలింగ్ లేదా ఏవైనా ఏర్పాట్లు చేయాలని నేను సర్పంచ్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేశాను. నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశాను. నాతో పాటు వచ్చిన పిల్లలు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేశారు, కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మా మాటలను పట్టించుకోలేదు." అన్నాడు.
అయితే తాను ఆ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లలేదని గ్రామ ప్రస్తుత సర్పంచ్ పూజా అహిర్వార్ చెబుతున్నారు.
ఆమె బీబీసీతో "నేను ఈ విషయం ఇంకెవరికీ చెప్పలేదు. నాకు ముందు ఒక సర్పంచ్ ఉండేవారు, కానీ ఆయన ఏమీ చేయలేదు. అందుకే మేము అంతకు మించి పెద్దగా ప్రయత్నించలేదు. వర్షాకాలంలో పిల్లలు ఈ దారిలో అసలు వెళ్ళేవారు కాదు." అన్నారు.
వీడియో వైరల్ అయినప్పటి నుంచి పలోహ్‌లో ఖచ్చితంగా కొన్ని మార్పులైతే వచ్చాయి. కానీ ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన కథ కాదు.

ఫొటో సోర్స్, Rachit Dubey
ఇలాంటి ప్రాంతాలు మరెన్నో
మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో దారుణంగా ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి.
విదిశకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని సాగర్ జిల్లాలో ఉన్న రాహ్లి డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెల్ఖేడి కలాన్ గ్రామంలోకూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
వర్షాలు కురిసే రోజుల్లో గ్రామంలోని పిల్లలు స్కూలుకు వెళ్లడానికి నదిని దాటాల్సి ఉంటుంది.
నీటిమట్టం పెరిగినపుడు పిల్లలు తమ బట్టలు తడవకుండా చూసుకుంటూ, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నదిని దాటుతుంటారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి తలెత్తుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, రాహ్లీ జనపద్ పంచాయత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవి పాటిదార్ తమ యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.
"ఈ విషయం గురించి మేము అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అవసరమైన మేరకు ఏర్పాట్లు చేస్తాము," అన్నారు.
ఇక సాగర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్లా జిల్లాలో పరిస్థితి ఇంకాస్త భిన్నంగా ఉంది.
మాండ్లా జిల్లాలోని సింఘన్‌పురి పంచాయతీలో స్కూలుకు శాశ్వత భవనం లేకపోవడంతో కొన్నేళ్లుగా చిన్న పిల్లలకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలు అదే తాత్కాలిక షెడ్డులో చదువుకుంటున్నారు.
ఈ సమస్యపై తాను అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశానని గ్రామ సర్పంచ్ ప్రతాప్ సింగ్ మరావి తెలిపారు.
ఆయన బీబీసీతో "నేను గ్రామ పంచాయతీకి, ప్రజాభిప్రాయ సేకరణలో దరఖాస్తులు సమర్పించాను. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఏ అధికారి కూడా రాలేదు. అక్కడ భవనం కూడా కట్టలేదు. అక్కడ స్కూల్ భవనాన్ని నిర్మించాలన్నదే ప్రయత్నం. ఎందుకంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది" అన్నారు.
ఈ అంశంలో ఇప్పుడు చర్యలు ప్రారంభించామని మాండ్లా జిల్లా యంత్రాంగం చెబుతోంది.
"ఆ విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై తదుపరి చర్యలు చేపట్టాం. ప్రభుత్వం కూడా స్కూల్ బిల్డింగ్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు దాని నిర్మాణం ప్రారంభిస్తున్నాము" అని మండ్లా కలెక్టర్ రాహుల్ నామ్‌దేవ్ ధోటే తెలిపారు.

ఫొటో సోర్స్, Vishnukant Tiwari
కోర్టుకు చేరిన ప్రశ్నలు
విదిశ, సాగర్, మాండ్లా అనే ఈ మూడు జిల్లాల్లో మూడు రకాల సమస్యలు ఉన్నాయి.
ఒక దగ్గర పిల్లలు స్కూలుకు చేరుకోవడానికి డ్యామ్ పిల్లర్స్ దూకాల్సి వస్తుంటే, ఇంకో చోట విద్యార్థులు నదులను దాటుతున్నారు. మరో చోట అసలు స్కూల్ బిల్డింగే లేకపోవడంతో పశువుల కొట్టాలలో తరగతులు జరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో పాఠశాల విద్యా శాఖకు రూ.45 వేల కోట్లకు పైగా కేటాయించి ఉన్న సమయంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి
విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నేర్చుకునే వాతావరణాన్ని మెరుగుపరచడమే ఈ బడ్జెట్ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఇటీవల, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితికి సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ రాష్ట్ర. కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని 2025 నాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక సూచిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు అభిషేక్ తునావత్, బి.ఎల్. జైన్ కోర్టుకు తెలిపారు.
రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పనిచేస్తున్నాయని, చాలా పాఠశాలల్లో విద్యుత్, మరుగుదొడ్లు లాంటి ప్రాథమిక సౌకర్యాలు లేవని ఆ నివేదిక పేర్కొన్నట్లు వారు పిటిషన్‌లో ఉదహరించారు.
అదే సమయంలో రాష్ట్రంలో సుమారు 40 శాతం అంటే 1 లక్షా 15 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























