నల్సార్: "సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను స్నాతకోత్సవానికి పిలవడంపై పునరాలోచించుకోవాలి" అంటూ విద్యార్ధులు రాసిన లేఖలో ఇంకా ఏముంది?

ఫొటో సోర్స్, Nalasar/FB/ GettyImages
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను స్నాతకోత్సవానికి ఆహ్వానించే విషయంపై హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్ (నల్సార్) యూనివర్సిటీలో వివాదం రేగింది.
సీజేఐను ఆహ్వానించడాన్ని పునఃపరీశీలించాలని 2026 స్నాతకోత్సవ విద్యార్థులు కొందరు యూనివర్సిటీ పాలకవర్గానికి ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
ఈ వ్యవహారంపై కొందరు విద్యార్థులతో బీబీసీ మాట్లాడింది. తమ పేర్లు ప్రస్తావించడానికి వారు ఇష్టపడలేదుగానీ, ఈ మేరకు ఈ-మెయిల్ పంపిన విషయం నిజమేనని కొందరు ధ్రువీకరించారు.
నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ సహా పరిపాలనా పదవుల్లో ఉన్న వారికి ఈ-మెయిల్ పంపించడం నిజమేనని వారు నిర్ధరించారు.
జులై 23న పంపించిన ఈ వినతి పత్రం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై యూనివర్సిటీ పాలన విభాగం స్పందించాల్సి ఉంది.


ఫొటో సోర్స్, UGC
'ముఖ్య అతిథిపై పునఃపరిశీలించండి'
నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం త్వరలో జరగనుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని పరిపాలన విభాగం నుంచి యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లకు జులై రెండోవారంలో సమాచారం అందింది.
స్నాతకోత్సవ తేదీ, సమయం ఇంకా ఖరారు కావాల్సి ఉందని యూనివర్సిటీ పరిపాలన విభాగం తెలిపిందని ప్రొఫెసర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
''కార్యక్రమానికి సీజేఐ వచ్చేందుకు ఆసక్తి చూపించారని మాకు అధికారికంగా సమాచారం ఉంది'' అని ఆ ప్రొఫెసర్ బీబీసీతో వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న సున్నితత్వం దృష్ట్యా విద్యార్థులు గానీ, అధ్యాపకులు గానీ తమ పేర్లు ఈ కథనంలో ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు.
సీజేఐ సుముఖత వ్యక్తం చేసిన విషయం విద్యార్థులకు తెలిసింది.
కార్యక్రమానికి సీజేఐను ఆహ్వానించడంపై పునఃపరిశీలించాలని కొందరు విద్యార్థులు ఈ-మెయిల్ వినతి పత్రం ద్వారా కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యార్థుల అభ్యంతరాలు ఏమిటి?
''స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడంపై విద్యార్థులుగా మాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు కనుక ముఖ్య అతిథి విషయంలో చర్చ నడుస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోగలరు'' అని విద్యార్థులు తమ ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
ఈ-మెయిల్ మొదట న్యాయశాస్త్ర విద్యార్థులు పంపగా, ఆ తర్వాత మిగిలిన విభాగాల విద్యార్థులు తమ అభ్యంతరాలతో ఈ-మెయిల్ జత చేసినట్లు విద్యార్థి ఒకరు బీబీసీతో చెప్పారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపు మేరకు జులై 20న యువత, విద్యార్థులు దిల్లీలో 'చలో పార్లమెంట్'ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"పోలీసుల క్రూరత్వానికి వీడియో సాక్ష్యం ఉంది. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు" అని ఆ న్యాయవాది అన్నారు.
ఈ పిటిషన్‌పై స్పందిస్తూ "మీ సమయాన్ని వృథా చేసుకోకండి, మా సమయాన్ని కూడా వృథా చేయకండి" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
యువత, విద్యార్థుల విషయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ-మెయిల్ ద్వారా వినతి పత్రం పంపిస్తూ తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
''బోధనా విలువలకు విరుద్ధం’’
''న్యాయశాస్త్రంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులుగా మా ఆందోళన పరిధి పరిమితమైంది. విశ్వవిద్యాలయ స్వీయ విలువలు, రాజ్యాంగ హక్కులు, న్యాయం, వినతుల స్వీకరణ, అభ్యంతరాలపై చర్చకు కట్టుబడి ఉండటానికి స్నాతకోత్సవం సూచికగా నిలుస్తుంది. విశ్వవిద్యాలయం తీసుకునే నిర్ణయాలను ప్రతిబింబించే సందర్భం ఇది.
పోలీసుల దౌర్జన్యంపై ఆరోపణలను తోసిపుచ్చిన వ్యక్తి నుంచి మా పట్టాలు అందుకోవడమనేది నల్సార్‌లో మాకు బోధించిన విలువలకు విరుద్ధంగా ఉందని భావిస్తున్నాం'' అని విద్యార్థులు తమ ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపిక చేసిన వారి విషయంలో విశ్వవిద్యాలయం పునరాలోచించాలని గట్టిగా కోరుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.
''ఈ విషయంపై యూనివర్సిటీ పరిపాలన విభాగం విద్యార్థి ప్రతినిధులు లేదా ఇతర భాగస్వామ్య పక్షాలతో తగిన రీతిలో చర్చించాలని కోరుతున్నాం'' అని విద్యార్థులు ఈ-మెయిల్‌లో కోరారు.

ఫొటో సోర్స్, https://nalsar.ac.in/about/organisation/
నల్సార్ ఏమంటోంది?
విద్యార్థుల ఈ-మెయిల్ వ్యవహారంపై నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవ రావు, రిజిస్ట్రార్ ఎన్.వాసంతిని ఈ-మెయిల్, ఫోన్ కాల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వారు ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు, ముంబయిలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో ఆగస్టు 2న జరగాల్సిన స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉందని, ఆ కార్యక్రమం వాయిదా పడిందని 'ది హిందూ' రిపోర్టు చేసింది.
స్నాతకోత్సవాన్ని కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లుగా టిస్ జులై 31న ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























