మహిళల 800 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డ్‌ను 40 ఏళ్లుగా ఎవరూ ఎందుకు బ్రేక్ చేయలేకపోయారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎమ్మా మిడిల్టన్
- హోదా, బీబీసీ స్పోర్ట్ జర్నలిస్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
నాలుగు దశాబ్దాలు దాటినా అథ్లెటిక్స్ మహిళల 800 మీటర్ల ప్రపంచ రికార్డును ఇంతవరకు ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు.
ఆ ప్రపంచ రికార్డ్ 43 ఏళ్లుగా చెక్కుచెదరలేదు.
షూ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, పోషకాహారం, శరీరాన్ని సిద్ధం చేసుకోవడంపై అవగాహన ఎంత పెరిగినా ఇప్పటికీ ఆ రికార్డ్ ఎందుకు ఛేదించలేకపోయారు?
ఈ వారం బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న యూరోపియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ ముగ్గురు మిడిల్ డిస్టెన్స్ రన్నర్లు పాల్గొంటున్నారు.
మరి, ఈసారైనా ఆ రికార్డ్ బద్దలవుతుందా?
చెక్కుచెదరని రికార్డ్
మహిళల 800 మీటర్ల ప్రపంచ రికార్డ్ చెక్ అథ్లెట్ జర్మిలా క్రాటోచ్విలోవా పేరిట ఉంది. ఆమె 1983లో కేవలం 1 నిమిషం 53:28 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు.
అయితే, అప్పట్లో ఆమె సొంత దేశంలో అమల్లో ఉన్న క్రమబద్ధమైన డోపింగ్ విధానం కారణంగానే మ్యునిచ్ పోటీల్లో జర్మిలా అసాధారణ ప్రదర్శన సాధ్యమైందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ, వాటిని ఆమె ఖండించారు.
కేవలం జర్మిలా రికార్డ్‌పైనే ఇలాంటి ఆరోపణలు రాలేదు.
తూర్పు జర్మనీకి చెందిన మారిటా కోచ్ 1985లో మహిళల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. ఆ సమయంలో ఆ దేశం కూడా తమ అథ్లెట్లకు క్రమబద్ధంగా డోపింగ్ చేసిందన్న వాదనలున్నాయి.
అయితే, మారిటా ఎప్పుడూ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కాలేదు. తాను ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదని ఆమె చెబుతూ వచ్చారు.

ఇదిలా ఉంటే, 2005కి ముందు నమోదైన ప్రపంచ రికార్డులన్నింటినీ తొలగించాలని 2017లో యూరోపియన్ అథ్లెటిక్స్ ప్రతిపాదించింది.
అయితే, ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. కానీ, 2005 కంటే ముందు నమోదైన రికార్డులను వివాదాస్పదంగా మార్చవచ్చనే బలమైన సంకేతాలు పంపాయి. ఎందుకంటే, 2005 తర్వాతి నుంచే వరల్డ్ అథ్లెటిక్స్ (గతంలో ఐఏఏఎఫ్) రక్తం, నమూనాలను భద్రపరచడం ప్రారంభమైంది.
1983 నాటికి, 32 ఏళ్ల వయసున్న జర్మిలా తన సమీప ప్రత్యర్థి అయిన పోలాండ్‌కు చెందిన జోలాంటా జనుచ్తా కంటే 7 సెకన్ల ముందుగానే గమ్యానికి చేరుకున్నారు.
పాతికేళ్ల పాటు ఏ అథ్లెట్ కూడా ఆమె రికార్డుకు సెకను దూరంలో కూడా నిలవలేకపోయారు.
ఈ రికార్డుకు చేరువగా వచ్చిన అథ్లెట్ స్విట్జర్లాండ్‌కు చెందిన ఆడ్రీ వెర్రో. ఈ ఏడాది జూన్‌లో ఆమె 1 నిమిషం 53:80 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించారు.
ఇప్పటికీ అందుకోలేమా?
"నిజంగా చెబుతున్నా. ఒక నిమిషం 53.28 సెకన్లనేది అద్భుతం" అని ప్రపంచంలోనే అత్యుత్తమ మిడిల్ డిస్టెన్స్ రన్నర్లలో ఒకరైన బ్రిటన్‌కు చెందిన కీలీ హాడ్కిన్సన్ కోచ్, బ్రిటిష్ మాజీ రన్నర్ అయిన జెన్నీ మెడోస్ బీబీసీ స్పోర్ట్‌తో అన్నారు.
"నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచాను. కానీ, ఒక మహిళ అంత వేగంగా పరిగెత్తగలదనే విషయం నా ఊహకు కూడా అందలేదు" అన్నారు.
అయితే, ఇప్పుడు అథ్లెట్లు ఆ రికార్డు బద్దలుకొట్టేందుకు చేరువయ్యారు. వెర్రో ఈ ఏడాది రెండుసార్లు 1 నిమిషం 54 సెకన్లలోపు లక్ష్యాన్ని ఛేదించారు. అయినా, జర్మిలా రికార్డుకు ఇంకా అరసెకను దూరంలో ఉన్నారు.
ఒలింపిక్ చాంపియన్ అయిన కీలీ హాడ్కిన్సన్ ఫిబ్రవరిలో ఇండోర్ 800 మీటర్ల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. 2002 నాటి ఆ ప్రపంచ రికార్డును 1 నిమిషం 54:87 సెకన్లలో ఛేదించారు.
ఇదే కోవలో, నెదర్లాండ్స్‌కు చెందిన ఫెంకే బ్రూడర్స్ కూడా ఉన్నారు. జూన్‌లో జరిగిన పారిస్ డైమండ్ లీగ్‌లో ఆమె 1.55.60 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నారు.
"వీరంతా ఒకరికొకరు పోటీపడుతూ అద్భుతమైన రికార్డుల వైపు సాగుతున్నారు. గత రెండేళ్లలో 800 మీటర్ల పోటీల స్థాయి బాగా పెరిగింది" అని 20212 లండన్ ఒలింపిక్స్‌లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణ పతకం సాధించిన జెస్సికా ఎన్నిస్ హిల్ అన్నారు.
స్పోర్ట్స్ సైన్స్‌లోని నూతన ఆవిష్కరణలు కూడా అథ్లెట్లను రికార్డుకు మరింత చేరువ చేశాయి.
"షూ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో మెరుగుపడింది, కాబట్టి గతంతో పోలిస్తే అందరూ వేగంగా పరిగెడుతున్నారు" అని ఎక్స్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ జోన్స్ బీబీసీ స్పోర్ట్‌తో అన్నారు.
జోన్స్ అప్లైడ్ ఫిజియాలజీలో నిపుణులు. తక్కువ సమయంలో లక్ష్య ఛేదన కోసం ఆయన మిడిల్ డిస్టేన్స్, లాంగ్ డిస్టేన్స్ రన్నర్లతో కలిసి పనిచేస్తున్నారు.
"క్రియాటిన్, నైట్రేట్, ముఖ్యంగా బైకార్బొనేట్ వంటి సప్లిమెంట్ల గురించి మనకు ఇప్పుడు మంచి అవగాహన ఉంది. అలాగే, పనితీరును ఏవేవి నియంత్రిస్తాయనే వాటి గురించి కూడా తెలుసు.
కార్బొహైడ్రేట్లపై అవగాహన, అంటే 800 మీటర్ల వంటి మిడిల్ డిస్టేన్స్ పోటీల్లో శరీరానికి సరైన శక్తి(ఇంధనం) ఎలా అందించాలనే విషయాలపై కూడా అవగాహన ఉంది."
ఇది కొంతవరకు పార్ములా వన్ రేస్ లాంటిదని జోన్స్ అన్నారు.
కారు ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసే సమయానికి ఇంధనం దాదాపు ఖాళీ అవ్వాలని, ఒకవేళ సగం ట్యాంకు ఇంధనం అలాగే ఉంటే మీరు అదనపు బరువును మోసుకెళ్తున్నట్లేనని ఆయన అన్నారు.
ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న పోటీల్లో, ప్రపంచంలోని అత్యుత్తమ ముగ్గురు 800 మీటర్ల రన్నర్లు సెమీఫైనల్స్‌లో విజయం సాధించి, ఉత్కంఠభరిత ఫైనల్లో పోటీపడేలా కనిపిస్తున్నారు.
ఆ ఫైనల్ పోటీ వ్యూహాత్మక రేసుగా మారుతుందో, లేక వేగానికి పరీక్షగా మారుతుందో వేచిచూడాలి.
(ఈ కథనం బీబీసీ స్పోర్ట్ 'ఆస్క్ మీ ఎనీథింగ్' టీం తాజా కథనం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























