You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడు, ఏయే దేశాలవారికి కనిపిస్తుంది?
- రచయిత, డైసీ స్టీఫెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆగస్టు 12వ తేదీ బుధవారం సూర్య గ్రహణం ఏర్పడనుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని చూసే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.
మీరు దాన్ని నేరుగా చూడలేకున్నా ప్రపంచవ్యాప్తంగా చూసిన వాళ్లు తీసే కొన్ని అద్భుతమైన చిత్రాలను వీక్షించవచ్చు.
సూర్యగ్రహణం అంటే ఏంటి?
చంద్రుడు.. భూమి, సూర్యుడి మధ్యగా ప్రయాణించినప్పుడు సూర్యుడి కాంతిలో కొంత భాగం లేదా మొత్తం భూమికి చేరకుండా అడ్డుకున్నప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
సూర్యగ్రహణంలో అనేక రకాలున్నాయి. మీరు దేన్ని చూడగలరనేది.. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు, మీరున్న ప్రాంతం నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
చంద్రుడు.. సూర్యుడు, భూమితో సరిగ్గా ఒకే రేఖలోకి వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఆకాశం తెల్లవారుజామున లేదా సంధ్యాసమయంలో ఉన్నట్లుగా చీకటిగా మారినప్పుడు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది.
మీరు చంద్రుడి ఉంబ్రా (చంద్రుడి నీడ మధ్య భాగం లేదా అత్యంత దట్టమైన చీకటి భాగం) పరిధిలోకి వస్తే మీరు దీనిని చూడగలరు.
గ్రహణం పట్టిన సూర్యుడి చుట్టూ కొన్నిసార్లు ప్రకాశవంతమైన వలయాన్ని చూడవచ్చు.
ఇది సూర్యుడి బాహ్య వాతావరణం. దీనిని కరోనా అంటారు. సాధారణంగా సూర్యుడి ఉపరితల ప్రకాశం వల్ల ఇది కనిపించదు.
మీరు చంద్రుని బాహ్య నీడలో.. పెనుంబ్రా అని పిలిచే ప్రాంతంలో ఉంటే పాక్షిక గ్రహణాన్ని చూస్తారు. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిలో కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తాడు. దాంతో అది నెలవంక ఆకారంలోకి మారుతుంది.
చంద్రుడు సూర్యుడి ముందు ఉన్నప్పటికీ, భూమి నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల దాన్ని పూర్తిగా కప్పలేనప్పుడు కంకణాకార గ్రహణం ఏర్పడుతుంది.
చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అంటే అది పూర్తిగా గుండ్రంగా ఉండదు. చంద్రుడు భూమి నుంచి తన అత్యంత దూర బిందువు వద్ద లేదా దానికి సమీపంలో సూర్యుడి ముందు నుంచి వెళితే, అది మనకు చిన్నదిగా కనిపిస్తుంది.
ఈ రకమైన గ్రహణంలో, చంద్రుడి చుట్టూ సూర్యుడి ప్రకాశవంతమైన చక్రాన్ని మీరు ఇంకా బాగా చూడవచ్చు.
ఈ సూర్యగ్రహణాలన్నీ చంద్రగ్రహణాలకు భిన్నమైనవి. చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు చంద్రుడి మధ్య భూమి ఒకే రేఖలో ఉన్నప్పుడు చంద్రుడిపై నీడ పడుతుంది.
ఎక్కడెక్కడ..?
ఆగస్టు 12 బుధవారం సూర్యగ్రహణం ఏర్పడనుంది.
ఉత్తర రష్యా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణంగా కనిపిస్తుంది.
సూర్యుడుని చంద్రుడు పూర్తిగా కప్పేసే సంపూర్ణ గ్రహణం ఉత్తర రష్యాలోని ఒక చిన్న, మారుమూల ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో ఏర్పడుతుందని నాసా చెబుతోంది.
ఆ తర్వాత అది భూమి చుట్టూ తూర్పు దిశగా సాగుతూ సూర్యాస్తమయానికి ముందు స్పెయిన్‌కు చేరుకుంటుంది.
ఇది త్వరగా ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం రెండున్నర నిమిషాల కంటే తక్కువసేపు మాత్రమే ఉంటుంది.
ఉత్తర అమెరికా, కెనడా, వాయువ్య ఆఫ్రికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో సూర్యుడిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ భాగం కనిపించదు.
ఆఫ్రికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సూర్యాస్తమయ గ్రహణం ఉంటుంది. అంటే సూర్యుడు పాక్షికంగా గ్రహణంలో ఉన్నప్పుడే అస్తమిస్తాడు.
సూర్యగ్రహణాన్ని చూడటం ఎలా?
సూర్యగ్రహణాన్ని నేరుగా చూసేందుకు ప్రయత్నించవద్దు. సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా అవి తగినంత రక్షణను ఇవ్వవు.
నేరుగా సూర్యగ్రహణాన్ని చూడటం వల్ల మీ రెటీనాకు శాశ్వత నష్టం కలగవచ్చు.
ప్రత్యేక గ్రహణ కళ్లద్దాలు ధరించినప్పుడే సూర్యుడిని చూడండి. ఇవి సన్‌గ్లాసెస్ కంటే వేల రెట్లు ముదురు రంగులో ఉంటాయి.
సూర్య గ్రహణాన్ని చూసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ISO 12312-2 వాటిని ఎంచుకోండి.
కెమెరా లెన్స్, టెలిస్కోప్, బైనాక్యులర్స్ లేదా మరే ఇతర ఆప్టికల్ పరికరం ద్వారా చూడకండి.
గ్రహణ కళ్లద్దాలు ధరించినప్పటికీ. కేంద్రీకృత సౌర కిరణాలు ఫిల్టర్‌ను కాల్చివేసి మీ కంటికి గాయం చేయగలవని నాసా చెబుతోంది.
సూర్యుడి ప్రతిబింబాన్ని ఇతర మార్గాల్లోనూ చూడవచ్చు.
ఇలా చేయండి:
రెండు కార్డు ముక్కలను తీసుకోండి. మీ వీపును సూర్యుడి వైపు ఉంచి ఆ కార్డు ముక్కలను మీ భుజాలకు ఎదురుగా ఉండేలా ఒక దాని తర్వాత ఒకటి పట్టుకోండి. దీని వల్ల మీకు దగ్గరగా ఉన్న కార్డు నీడ మరో కార్డుపై పడుతుంది.
మీకు దగ్గరగా ఉన్న కార్డ్‌పై చిన్న రంధ్రం చేస్తే, సూర్యుడి కిరణాలు దాని గుండా వచ్చి వెనుక ఉన్న కార్డ్‌పై చిన్న వృత్తంలా ప్రతిబింబిస్తాయి.
మీకు దగ్గరగా ఉన్న కార్డుకు బదులుగా, జల్లెడ మాదిరిగా ఒకటి కంటే ఎక్కువ రంధ్రాలు ఉన్న వస్తువును కూడా ఉపయోగించవచ్చు.
అలా గ్రహణం జరుగుతున్నప్పుడు చంద్రుని కాంతి ఆ వృత్తాన్ని క్రమంగా కప్పివేయడాన్ని మీరు చూడగలుగుతారు.
మిగతావన్నీ విఫలమైతే లేదా వాతావరణం అడ్డంకిగా మారితే నాసాతో పాటు అనేక సంస్థలు చానళ్లు అందించే లైవ్ ప్రసారాన్ని చూడొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)