''అందుకే రాజీనామా చేశా'' ధర్మేంద్ర ప్రధాన్

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రెండు వారాల తర్వాత, ఆ వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల సమయంలో "కొంతమంది జెన్‌జడ్ యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు'' అని ప్రధాన్ అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత కలిసి కొన్ని వారాలపాటు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

తన స్వరాష్ట్రమైన ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని జీఎం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "జెన్‌ జెడ్ యువత కూడా మన పిల్లలే. కొంతమంది వారిని గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నించారు'' అని వ్యాఖ్యానించారు.

"ఆ సమయంలో నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదు. భారత్‌లో ఏటా కనీసం 2 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారు. గత పదేళ్లలో 20 కోట్ల మంది పిల్లలు పుట్టారు. వారికి కలలు ఉన్నాయి. వారు దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతారు. నాకు మంత్రి పదవి అనేది ముఖ్యం కాదు'' అన్నారు.

తానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

అయితే ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు స్పందిస్తూ, జెన్‌జెడ్ ఆందోళనల ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేశారని ఆరోపించారు.

''ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటనకు 48 గంటల ముందు వరకు ప్రభుత్వం స్థాయిలో అలాంటి నిర్ణయం గురించి ఆలోచన కూడా జరగలేదు. కానీ ఆందోళనలు పెరుగుతుండటం, పార్లమెంటులో గందరగోళం, ప్రభుత్వ చర్యలపై ఆందోళనకారుల్లో పెరుగుతున్న ఆగ్రహం చివరకు ఈ నిర్ణయానికి దారితీశాయని'' ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

జెన్ జెడ్ ఉద్యమం జరుగుతున్న సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ శాఖను కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మార్చవచ్చనే ఊహాగానాలు మీడియాలో వచ్చినప్పటికీ, ఆందోళనకారులు మాత్రం ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌పై పట్టుదలగా నిలిచారు.

తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ:

"జెన్ జెడ్ పిల్లలు మనవాళ్లే. కొంతమంది వారిని మోసం చేయడానికి ప్రయత్నించారు. మంత్రి పదవి నా ప్రతిష్ఠకు సంబంధించినది కాదు. కొత్త తరం సంకల్పం ముందు నా బాధ్యత చాలా చిన్నది. కొత్త తరం సంకల్పం వెనక ఉన్న నిజాన్ని ప్రధానమంత్రికి వివరించడానికి ప్రయత్నించాను. దేశ హితాని కంటే గొప్పది ఏదీ లేదు. యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం" అని చెప్పారు.

ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు

ధర్మేంద్ర ప్రధాన్ తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా ఆయన "జెన్ జెడ్ ను కొంతమంది మోసం చేశారు" అనే వ్యాఖ్యను వారు తప్పుబట్టారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ''విద్యార్థులకు ఇది ధర్మేంద్ర ప్రధాన్ తప్పేనని తెలుసు. ఎందకంటే విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉంది'' అన్నారు.

"రాజీనామా చేసిన తర్వాత ఆయనకు నిజం అర్ధమవుతుందనుకున్నా. కానీ ఆయన ఇంకా మరో లోకంలో ఉన్నారు. మీ హయాంలో విద్య వాణిజ్యీకరణకు గురైంది. డబ్బు కోసం 152 పేపర్లు లీక్ అయ్యాయి. స్వతంత్రంగా ఉన్న విద్యా వ్యవస్థను మీ హయాంలో ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా మార్చారు. మీరు చాలా కాలం క్రితమే రాజీనామా చేయాల్సింది. ఇప్పటికైనా దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలి'' అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ "ఒక్క విషయం చెప్పండి, పేపర్ లీక్ నిజమా,కాదా? 21 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారా లేదా? ఈ రెండూ నిజమైతే జెన్‌జెడ్‌ను తప్పుదోవ పట్టించారనే ప్రశ్న ఎందుకు వస్తోంది? అన్నారు.

"ధర్మేంద్ర ప్రధాన్ ముందుగానే రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. జెన్‌జెడ్ ఉద్యమం ఒత్తిడి కారణంగానే బీజేపీ ఆయనను తొలగించాల్సి వచ్చింది. జెన్ జెడ్ ఆలోచనలు, దృష్టికోణం బీజేపీతో సరిపోవడం లేదు. అందుకే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు'' అని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అన్నారు.

జేడీయు నాయకుడు రాజీవ్ రంజన్ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌ను సమర్థించారు.

"ధర్మేంద్ర ప్రధాన్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు, అరెస్టులు జరిగేలా చేశారు, అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఆయన రాజీనామా చేశారు" అన్నారు.

"నిన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని యువత, జెన్‌జెడ్ యువతకు తన వల్ల ప్రయోజనం కలిగితే, ఆ ప్రయోజనం కోసం తాను ఈ త్యాగాన్ని ఎన్నిసార్లయినా అంగీకరిస్తానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం యువత ముందుకు సాగడం మనందరి లక్ష్యం" అని ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా అన్నారు.

శివసేన (యూబీసీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ: "జెన్‌జెడ్‌ యువతను తప్పుదోవ పట్టిస్తే ఎవరు పట్టించారు? ఎవరు రెచ్చగొట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి'' అన్నారు.

పార్లమెంటులో ఘన స్వాగతం

రాజీనామా చేసిన తర్వాత జూలై 27న ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. అక్కడ బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఆయన కారు దిగిపోయి పార్లమెంట్ వైపు వెళ్తుండగా బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు ఆయన చుట్టూ చేరారు. ఆయనను కలవడానికి, కరచాలనం చేయడానికి ఎంపీల మధ్య పోటీ కనిపించింది.

ఇటీవలే ఏదో గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది.

దీనిపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ ''అవినీతికి, ధ్వంసమైన భారతీయ విద్యావ్యవస్థకు ధర్మేంద్రప్రధాన్ ఎప్పటికీ ప్రతీకగానే ఉంటారు.ఇదే వ్యవస్థ 26 మంది పిల్లల ప్రాణాలను తీసింది, లక్షలాది మంది యువతను వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఆయన నైతిక బాధ్యతతో రాజీనామా చేయలేదు. యువత ఆగ్రహానికి భయపడి రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే వ్యక్తికి బీజేపీ పార్లమెంట్‌లో పూలమాలలు వేస్తోంది. ఇది గౌరవం కాదు. లక్షలాది పిల్లల భవిష్యత్తు నాశనాన్ని జరుపుకోవడం. దేశంలోని ప్రతి విద్యార్థి దీనిని గమనిస్తున్నాడు. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరినీ వారు గుర్తుంచుకుంటారు. అని రాశారు.

కొన్ని వారాలుగా జంతర్ మంతర్ వద్ద సీజేపీ జరిపిన ఆందోళన సందర్భంగా, జూలై 20న 'పార్లమెంట్ మార్చ్'కు పిలుపునిచ్చినప్పుడు, ఆ రోజున భారీ హింస చోటుచేసుకుంది. విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులు కనీసం నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు బీబీసీ నిర్థరించింది. ఈ కేసులు ఉన్నత న్యాయస్థానాలకు చేరాయి.

చివరగా, ధర్మేంద్ర ప్రధాన్ జులై 25న విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆ సమయంలో హోం మంత్రి అమిత్ షాతో సహా పలువురు బీజేపీ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసించారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆయనను ప్రశంసిస్తూ, "ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు, ఆయన ప్రజా జీవితం అంకితభావానికి నిదర్శనం" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)