మూడు రాష్ట్రాల పోలీసులకు ఒకప్పుడు సవాల్‌గా మారిన చంబల్ బందిపోటు రాజస్థాన్ జైల్లో ఎలా చనిపోయారు?

    • రచయిత, మొహర్ సింగ్ మీనా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

రాజస్థాన్‌లో అత్యంత భద్రత ఉండే అజ్మీర్ జైలులో చంబల్ లోయ ప్రాంతానికి చెందిన బందిపోటు జగన్ గుర్జర్ హత్యకు గురయ్యారు. జగన్ గుర్జర్ ఉండే సెల్‌లోని మరో ఖైదీ విష్ణు జాట్‌ ఈ హత్య చేసినట్టు ఆరోపణలొచ్చాయి.

హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో విష్ణు జాట్ అంగీకరించారు. జగన్ మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించగా అక్కడ ఆయన కుటుంబ సభ్యులు ఆ రోజంతా నిరసన వ్యక్తంచేశారు.

హత్యపై సీబీఐ విచారణ జరపాలని, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జగన్ గుర్జర్ కుటుంబం ధర్నా చేసింది. తమ డిమాండ్లలో కొన్నింటికి పోలీసులు అంగీకరించడంతో మంగళవారం(జూన్ 30)న సాయంత్రం మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి వారు అంగీకరించారు.

జగన్ గుర్జర్ మృతదేహానికి ఆయన స్వగ్రామంలో బుధవారం(జూలై 1) భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

చంబల్‌‌లోయకు చెందిన బందిపోటు జగన్ గుర్జర్ జైలులో హత్యకు గురికావడం, జైలులో భద్రతపై ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా, దశాబ్దాలుగా మూడు రాష్ట్రాల లోయల్లో భయానికి పర్యాయపదంగా నిలిచిన ఆ బందిపోటు కథను మరోసారి చర్చకు తీసుకువచ్చింది.

జగన్ గుర్జర్ ఎవరు?

జగన్ గుర్జర్ కుటుంబ సభ్యులు ధౌల్పూర్‌లో తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మృతదేహాన్ని తీసుకురావడానికి జగన్ గుర్జర్ కుటుంబంతో పాటు అజ్మీర్ వెళ్లిన బారి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవేంద్ర శర్మ "గుర్జర్ కుటుంబానికి, అధికార యంత్రాంగానికి మధ్య ఒప్పందం కుదిరింది" అని బీబీసీతో చెప్పారు.

"కుటుంబానికి భద్రత కల్పించడానికి అంగీకరించారు. జగన్ గుర్జర్ కొడుకు ఆశారామ్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేస్తారు. అజ్మీర్ జైలులో ఉన్న జగన్ గుర్జర్ తమ్ముడిని మరో జైలుకు తరలిస్తారు. జైలు అధికారులు, జైలు పరిపాలనాయంత్రాంగంపై విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు.

"కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు ధౌల్పూర్ జైలులో ఉన్న జగన్ గుర్జర్ సోదరుడు పప్పు గుర్జర్, లాల్ సింగ్, పాన్ సింగ్‌లను ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు. అప్పటి బారి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై కూడా విచారణ జరుపుతారు" అని తెలిపారు.

మంగళవారం రాత్రి పొద్దుపోయాక తమ నిరసనను నిలిపివేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.

ధౌల్పూర్ జిల్లా బారి పోలీస్ స్టేషన్ పరిధిలోని భావుతిపురా గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జగన్ గుర్జర్ బాల్యం సాధారణంగానే గడిచింది.

ఆ తర్వాత జగన్ గుర్జర్ చంబల్ ప్రాంతంలోని అత్యంత కరడుగట్టిన బందిపోట్లలో ఒకరిగా పేరుపడ్డారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోని చంబల్ లోయల్లో దశాబ్దాల పాటు ఆయన పేరు భయానికి మారుపేరుగా ఉండేది.

చంబల్ లోయల్లో చురుకుగా ఉన్న బందిపోటు దొంగల్లో బాగా పేరున్న వ్యక్తుల్లో ఆయనే చివరివారని పోలీసు అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో హత్య ఎలా జరిగింది?

జగన్ గుర్జర్‌కు ముగ్గురు భార్యలు. ఆయన తన మొదటి భార్యను బారి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ ఆమె ఓడిపోయారు.

జగన్‌కు స్వయంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉండేది. కానీ ఆయన నేర చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా అది సాధ్యపడలేదు.

ఆయన భార్యల్లో ఒకరైన కోమలేశ్ కూడా బందిపోటు కార్యకలాపాల కారణంగా వార్తల్లో నిలిచారు. నలుగురు సోదరులలో జగన్ గుర్జర్ మూడోవారు.

ఆయన తమ్ముడు పప్పు గుర్జర్ కూడా అజ్మీర్ జైలులో ఉండగా మరో ఇద్దరు సోదరులు భరత్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

రాజస్థాన్‌లోనే అత్యంత భద్రత ఉన్న జైలుగా పరిగణించే అజ్మీర్ హై సెక్యూరిటీ జైలులో జగన్ గుర్జర్ హత్య జరగడం జైలు భద్రతపై తీవ్రమైన సందేహాలు కలిగించింది.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటసారా, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అత్యంత కట్టుదిట్టమైన జైలులో జరిగిన హత్యపై రాజస్థాన్ డీజీ (జైళ్లు) అశోక్ కుమార్ రాథోర్‌ను బీబీసీ ప్రశ్నించగా, ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

"సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఈ హత్య జరిగింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

జగన్ గుర్జర్‌తో పాటు అదే సెల్‌లో ఉన్న విష్ణు జాట్‌పై హత్య ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్టు అజ్మీర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ అగర్వాల్ బీబీసీకి తెలిపారు.

"టవల్‌తో గొంతు నులిమి హత్య చేశారు" అని ఆయన చెప్పారు.

అయితే జగన్ గుర్జర్‌ను విష్ణు జాట్ ఎందుకు చంపారనేది పోలీసులు స్పష్టం చేయలేదు.

ఈ కేసులో నిందితుడైన విష్ణు జాట్ ఇప్పటికే ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారని పోలీసులు తెలిపారు.

"ఈ కేసు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ స్థాయిలో విచారణ జరుగుతుండగా పోలీసులు ప్రత్యేక దర్యాప్తును కొనసాగిస్తున్నారు" అని పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ అగర్వాల్ అన్నారు.

జగన్ గ్రామంలో పరిస్థితి సాధారణంగా ఉందని, ముందుజాగ్రత్తగా పోలీసు నిఘా కొనసాగిస్తున్నామని ధౌల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.

తమ డిమాండ్లపై కుటుంబం, పోలీసులు మధ్య ఒప్పందం వచ్చే వరకు జగన్ గుర్జార్ కుమారుడు ఆశారామ్, ఇతర కుటుంబ సభ్యులు అజ్మీర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ బయట చాలా గంటల పాటు నిరసన చేపట్టారు.

జగన్ సోదరుడు పప్పు గుర్జర్‌ను అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరగా అధికారులు అంగీకరించారు.

జగన్ గుర్జర్ బందిపోటు ఎలా అయ్యారు?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో జగన్ గుర్జర్‌పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ, లూటీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి సుమారు 128 కేసులు నమోదయ్యాయని ధౌల్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ సంగ్వాన్ బీబీసీకి ఫోన్‌లో తెలిపారు. దాదాపు 70 కేసుల్లో ఆయన నిర్దోషని తేలింది.

"1994లో జగన్ గుర్జర్ బావ హత్యకు గురయ్యారు. ఈ ఘటనే ఆయన నేర ప్రపంచంలోకి ప్రవేశించడంలో కీలక పాత్ర పోషించింది" అని ధౌల్పూర్‌కు చెందిన ఒకరు చెప్పారు.

"జగన్ తన బావ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురిని చంపారు. ఆ తర్వాత ఆయన తీవ్రమైన నేరాల కేసుల్లో చిక్కుకోవడం మొదలయింది" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ గ్రామస్థుడు తెలిపారు.

"జగన్‌ను పట్టుకోవడానికి మేము లోయలపై చాలాసార్లు దాడులు చేశాం. ఆ క్రమంలో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ ఆయనకు చంబల్ లోయల గురించి, మూడు రాష్ట్రాల సరిహద్దుల భౌగోళిక పరిస్థితి గురించి మంచి అవగాహన ఉండేది. ఆయన దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేవారు’’ అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

"జగన్ గుర్జర్ నాలుగు సార్లు లొంగిపోయారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ నేరాల్లో భాగమయ్యేవారు. జగన్ గుర్జర్ అంటే ప్రజలకు ఎంత భయమంటే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనేక కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల కావడానికి ఇది ఒక ప్రధాన కారణం" అని చెప్పారు.

రాజకీయాల్లోకి రావాలనుకుని..

2008లో జరిగిన గుర్జర్ రిజర్వేషన్ ఉద్యమం సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు చెందిన ధౌల్పూర్ ప్యాలెస్‌ను పేల్చివేస్తానని బెదిరించినట్టు ఆరోపణలు రావడంతో జగన్ గుర్జర్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.

ఆ బెదిరింపు తర్వాత వసుంధర రాజే రాజభవనం దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

2019లో బారి పట్టణంలో ఒక దుకాణదారుతో వివాదం తర్వాత తుపాకితో బెదిరించి ప్రధాన మార్కెట్‌ను మూసివేసి, కాల్పులు జరిపాడనే ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయన వార్తల్లోకి వచ్చారు.

"ఆ సమయంలో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత జగన్ గుర్జర్ నన్ను బెదిరించారు" అని అప్పటి బారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ మలింగా బీబీసీతో చెప్పారు.

2019లో బెయిల్‌పై విడుదలైన జగన్ గుర్జర్ ఇద్దరు మహిళలను తన గ్రామంలో నగ్నంగా ఊరేగించారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చనీయమైంది.

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన నేరాల్లో భాగమైనట్టు రికార్డులున్నాయి.

జగన్ గుర్జర్‌ను సీనియర్ జర్నలిస్ట్ హర్ష్ ఖటానా చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం "2019లో జరిగిన ఒక సంభాషణలో తాను నేర ప్రపంచాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని, రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్నట్టు జగన్ చెప్పారు.

"అనేక కేసులు, బందిపోటు దొంగగా ఆయనకున్న గుర్తింపు కారణంగా, ఆయన రాజకీయ ఆశయాలు ఎన్నడూ నెరవేరలేదు" అని హర్ష్ ఖటానా అన్నారు.

జగన్ గుర్జర్‌ గురించి తెలిసిన ధౌల్పూర్‌కు చెందిన ఓ మాజీ బందిపోటు, తన పేరు వెల్లడించని షరతుపై బీబీసీతో మాట్లాడుతూ "చాలాసార్లు, చంబల్ లోయలలో పోలీసులు తనను చేరుకోకముందే ఆయన రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్ళిపోయేవారు. ఈ కారణంగా ఆయన చాలా కాలం పాటు మూడు రాష్ట్రాల పోలీసులకు పెద్ద సవాలుగా నిలిచారు" అని చెప్పారు.

మార్చురీ బయట ధర్నా చేస్తున్న జగన్ గుర్జర్ కుమారుడు ఆశారామ్ తన తండ్రి హత్య ఒక కుట్ర అని ఆరోపించారు.

"ఈ హత్య పూర్తి ప్రణాళికతో జరిగింది. ఒక్కరే ఇలా చేయడం సాధ్యం కాదు. మా నాన్న చాలా బలవంతుడు. సీవర్ జైలులో ఆయనను చంపడానికి కుట్ర జరిగినప్పుడు ఆయన 15 మందితో పోరాడారు" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)