సెప్టెంబర్ 11 దాడులు: ‘‘నా మనసును నిరంతరం తొలిచేస్తోంది’’.. పాతికేళ్లు గడిచినా బాధిత కుటుంబాలకు దక్కని ఊరట

ఫొటో సోర్స్, Tom Resta
- రచయిత, ఆలిస్ కడీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
"ఆధునిక చరిత్రలో అమెరికా గడ్డపై జరిగిన అత్యంత క్రూరమైన నేరపూరిత చర్యగా" 9/11 దాడులను అమెరికా ప్రభుత్వం అభివర్ణించింది.
ఈ ఘటన జరిగి పాతికేళ్లు గడిచినా దాని సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై విచారణ ఇంకా మొదలు కాలేదు. దీంతో ఈ ఘటనలో న్యాయం జరగడానికి సమయం మించిపోతోందని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి సెప్టెంబర్ 11,2001న హైజాకర్లు విమానాలతో దూసుకుపోయారు. ఈ ఘటనలో చనిపోయిన దాదాపు 3వేలమందిలో టామ్ రెస్టా సోదరుడు జాన్, ఆయన భార్య సిల్వియా కూడా ఉన్నారు. అప్పటికి సిల్వియా ఏడునెలల గర్భిణి. అదే రోజు దాడికి యత్నించిన మరో విమానం ప్రయాణికులు ఎదురు తిరగడంతో పెన్సిల్వేనియాలోని పొలాల్లో కూలిపోయింది.
సెప్టెంబర్ 11 దాడులు జరగడానికి ముందురోజులలో జాన్, సిల్వియా దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా గదిని సిద్ధం చేస్తూ,బ్లూక్లూస్ అనే చిన్నారు టీవీ షోలోని పాత్రలను ఆ గది గోడలపై చిత్రిస్తున్నారు. తమకో బిడ్డ కావాలని ఎంతోకాలంగా కలలు కంటున్నారు. స్నేహితులు, బంధువుల పిల్లలను కూడా ఎంతో ముద్దుగా చూసుకునేవారు.
దాడి జరిగిన రోజున వ్యాపారవేత్తలైన జాన్, సిల్వియా దంపతులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని నార్త్ టవర్‌లో 92వ అంతస్తులో పని చేస్తున్నారు.
"ఇంత కాలం గడిచినా ఆ ఘటన నా గొంతు పెగలనీయడం లేదు" అని రెస్టా బీబీసీతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. "పాతికేళ్లు గడిచిపోయాయి. అయినా 9/11 ఘటన నిరంతరం నా మనసులో మెదులుతూనే ఉంది" అని ఆయన చెప్పారు.
9/11 దాడుల మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలీద్ షేక్ మహ్మద్, ఆయన సహనిందితులపై జరుగుతున్న విచారణ చూసేందుకు గ్వాంటనామో బేలోని యూఎస్ నావికా స్థావరానికి రెస్టా నాలుగు సార్లు వెళ్లారు.
ఈ విచారణ ప్రక్రియను ఆయన చాలా విసుగు పుట్టించేదిగా పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
విచారణ తేదీ ఖరారు
9/11 దాడుల తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆగ్నేయ క్యూబాలోని సైనిక స్థావరంలో ఓ మిలటరీ జైలు ఏర్పాటు చేశారు. కేఎస్‌ఎంగా తరచూ పిలిచే మహ్మద్‌ను ఇప్పటిదాకా దోషిగా తేల్చకుండానే 20 ఏళ్ల నుంచి అక్కడే నిర్బంధించారు.
ఈ దాడి కేసు విచారణను చూడటానికి బాధితులను లాటరీ పద్ధతిలో అనుమతి ఇస్తారు. భారీ భద్రత కలిగి ఉన్న కోర్టు రూమ్‌లో బాధితులు, మీడియా ప్రతినిధుల నుంచి నిందితులను వేరు చేస్తూ దట్టమైన గాజు గోడ ఉంటుంది.
విచారణకు జరిగే న్యాయపరమైన ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ఇప్పటివరకు ఈ పక్రియను ఐదుగురు వేరువేరు సైనిక న్యాయమూర్తులు పర్యవేక్షించారు.
దాడి జరిగి పాతికేళ్లు అవుతున్న వేళ గత నెలలో ఈ కేసు విచారణలో కొంత పురోగతి కనిపించింది. మహమ్మద్ కేసు విచారణ తేదీని జూన్ 2028గా ఖరారు చేశారు.
అయితే విచారణ మరింత ఆలస్యం కావచ్చని తాము మానసికంగా సిద్ధంగా ఉన్నామని రెస్టా చెప్పారు.ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. శిక్షలు ఖరారు చేసే విచారణ చూడటానికి తాము బతికి ఉంటామో లేదోనని తమ బంధువులు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
"ఈ నవంబర్‌కు మా నాన్నకు 98 ఏళ్లు నిండుతాయి. ఆయన శిక్షలు ఖరారయ్యే తీర్పు చూస్తారని మేం అనుకోవడం లేదు. మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. ఆ తీర్పును చూడాలని కోరుకుంటున్నారు. కానీ ముఖ్యంగా మా తల్లిదండ్రులు కూడా అంతకాలం ఉంటారని అనుకోవడం లేదు" అని చెప్పారు.
" విచారణ ప్రారంభమయ్యే సమయానికి నిందితులు బతికి ఉంటారా లేదా అన్నది కూడా అతిపెద్ద ఆందోళన ’’అని రెస్టా చెప్పారు.

ఫొటో సోర్స్, FBI
కోర్టు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలపై ఆసక్తి
నిందితులకు శిక్షలు పడే ప్రక్రియ ఆలస్యం కావచ్చనే రిస్టా ఆందోళనను ఇతర 9/11 బాధితుల బంధువులు కూడా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో స్టీఫెన్ గెర్హార్డ్ ఆరోసారి గ్వాంటనామోలో జరిగే విచారణకు హాజరయ్యారు. తన తమ్ముడు రాల్ఫ్ మృతికి సంబంధించి నిందితులకు శిక్ష పడటం చాలా ముఖ్యమన్నారు. దీని గురించి ఇకపై ఆలోచించాల్సిన పని లేకపోతే బావుండనుకున్నారు.
" రాల్ఫ్ జ్ఞాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా" అని స్టీఫెన్ గెర్హార్డ్ చెప్పారు. "రాల్ఫ్ కారు నా దగ్గర ఇప్పటికీ ఉంది. దాన్ని పూర్వరూపానికి తీసుకొచ్చే పనిలో ఉన్నాం. నేను ఈ మధ్య మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాను, వారి వద్ద కూడా ఆయనకు సంబంధించిన వస్తువులు దొరికాయి, ఇవి పాత వస్తువులు కాదు మా తమ్ముడికి చెందిన జ్ఞాపకాలు అనే భావన నాకు కలిగింది" అని వెల్లడించారు.
" మహమ్మద్, ఆయన సహ నిందితులంతా శిక్షలు పడే వరకు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే మా ఆశ" అని స్టీఫెన్ గెర్హార్డ్ తెలిపారు.
" వాళ్ల వయసు పైబడుతోంది... వారు శిక్ష అనుభవించకుండా చనిపోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే అది బాధిత కుటుంబాలకు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది. మనకు ఇష్టమైన వారిని సామూహికంగా హత్య చేసిన వారిని శిక్షించలేకపోయామనే భావన మిగిలిపోతుంది"అని స్టీఫెన్ గెర్హార్డ్ అభిప్రాయపడ్డారు.
కుట్రకు పాల్పడటం, హత్య చేయడం వంటి అభియోగాలు మహమ్మద్‌పై ఉన్నాయి. ఈ కేసులో 2,976 మంది బాధితుల పేర్లు చార్జ్‌షీట్‌లో నమోదయ్యాయి. భవనాన్ని విమానాలతో ఢీ కొట్టించేలా పైలెట్లకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేసి, ఆ ప్రణాళికలను అల్ -ఖైదా అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడైన ఒసామా బిన్ లాడెన్‌తో పంచుకున్నాడని ఈయనపై అభియోగాలు ఉన్నాయి.
గతంలో ఈయన కూడా 9/11 దాడి ప్రణాళిక అంతా తనదేనని అంగీకరించాడు.
విచారణ తేదీ 2028గా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకే మహమ్మద్‌ను బ్లాక్ సైట్స్ అనే సీఐఏ జైలు నుంచి గ్వాంటనామో బేకు తరలించారు. అక్కడ ఆయన చేసిన నేర అంగీకారాన్ని సైనిక న్యాయమూర్తి కొట్టివేశారు. "సీఐఏ జైలులో మహమ్మద్‌ను శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశారు" అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇవన్నీ అతను స్వచ్ఛందంగా అంగీకరించినవి కావు కాబట్టి, విచారణలో వీటిని మహమ్మద్‌కు వ్యతిరేక ఆధారాలుగా చూపించలేమని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Tom Resta
‘చిత్రవధతో విచారణ ఆలస్యం’
మహమ్మద్‌తోపాటు ఆయన సహనిందితులను చిత్రవధ చేయడమే ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలంపాటు సాగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతుననారు.
"ఈ కేసులో ప్రతి విచారణ అంశం కూడా ఈ హింస కోణంలోనే సాగింది." అని ఎడిన్‌బరో యూనివర్శిటీలోని అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ కేసీ మెక్‌కాల్- స్మిత్ తెలిపారు.
వాటర్ బోర్డింగ్, ఒత్తిడి కలిగించే పద్ధతుల ద్వారా సంవత్సరాల తరబడి నిందితులు వేధింపులకు గురయ్యారని ఆమె అన్నారు.
‘అమెరికాస్ ట్రయల్: టార్చర్ అండ్ ది 9/11 కేస్ ఆన్ గ్వాంటనామో బే’ పుస్తక రచయిత జాన్ ర్యాన్ మాట్లాడుతూ "గత నెలలో వచ్చిన తీర్పుతో మహమ్మద్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన సాక్ష్యాలు చెల్లుబాటు కాకుండా పోతాయి, ఇది ఈ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం" అని అన్నారు.
ప్రాసిక్యూషన్ వద్ద రికార్డు చేసిన ఫోన్ కాల్స్, రహస్యంగా రికార్డింగ్స్ లాంటి మరికొన్ని సాక్ష్యాలు ఉన్నాయని ర్యాన్ చెబుతున్నారు. అయితే భవిష్యత్ ట్రయల్స్‌లో వాటిని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం అన్నారు. " మహమ్మద్‌తోపాటు సహనిందితులకు మద్ధతు ఇచ్చే వర్గాలు ఈ సాక్ష్యాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేయవచ్చు. "
జార్జ్ డబ్ల్యూ బుష్ పరిపాలన కాలంలో మెరుగైన విచారణ పద్ధతుల్లో నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించినట్టు అమెరికా అంగీకరించింది. అయితే అధ్యక్షుడిగా బరాక్ ఒబామా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వాటిని నిలిపివేశారు.
నిందితులపై జరిగిన చిత్రవధ ఆరోపణలే కేసు విచారణను సాగ దీస్తున్నాయని, న్యాయం పొందే హక్కు తమకు లేకుండా పోయిందని 9/11 దాడి బాధిత కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి.
"వారిని హింసించకపోయి ఉంటే విచారణ చాలా సులభంగా జరిగేది. నిందితులకు చాలా కాలం క్రితమే మరణ శిక్ష పడేది." గెర్హార్డ్ అభిప్రాయపడ్డారు. "ప్రభుత్వాన్ని తాము నియంత్రించలేమని, కానీ దాని ప్రభావం మాపై పడుతోెంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాసిక్యూటర్స్‌తో నిందితుల ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు
గెర్హార్డ్, రెస్టా ఇద్దరూ 2025 మొదట్లో గ్వాంటనామో వెళ్లారు, ఎందుకంటే మహమ్మద్, అతని ఇద్దరి సహనిందితులు అమెరికా ప్రభుత్వం ప్రాసిక్యూటర్స్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా నేరాన్ని అంగీకరించాల్సి ఉంది. అయితే ఇలా ఒప్పుకుంటే వారికి శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. వారికి మరణ శిక్ష పడదు.
నిందితులు నేరం ఒప్పుకొని శిక్ష నుంచి తప్పించుకునే సమయంలో అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిందితులను బహిరంగ విచారించి, మరణశిక్ష విధించే అవకాశాన్ని కాదనడం అమెరికా ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని వాదించింది. ఆ ఒప్పందాన్ని నిలిపివేసే సమయంలో బీబీసీ బృందం అక్కడే ఉంది.
ఈ ఒప్పందం చెల్లుబాటుపై చట్టపరమైన వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇది సరైన మార్గమని కొందరు బాధితులు భావిస్తుంటే, మరికొందరు ఇది చాలా స్వల్పమైందని, ఇందులో పారదర్శకత లోపించిందని అభిప్రాయపడ్డారు.
నిందితులకు శిక్ష పడేలా చేయడానికి తాను ఈ ఒప్పందానికి మద్దతు ఇచ్చానని రెస్టా చెప్పారు.
" నా దృష్టిలో వీళ్లు (నిందితులు) రోడ్లపై తిరగడానికి అర్హత ఉన్న వారు కాదు. వాళ్లను ఉన్నచోటే ఉండనివ్వండి, వారికి శిక్ష పడటమే నాకు కావాలి" అన్నారు.
9/11 దాడిలో తన తండ్రిని కోల్పోయిన బ్రెట్ ఈగల్సన్, ప్లీ డీల్ కాకుండా పూర్తి స్థాయి ట్రయల్స్ జరిగి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు.
"ఈ ఖైదీలకు మరణ శిక్ష పడాలా లేదా అనే దానిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కొనసాగుతున్న ప్రక్రియపై నమ్మకం ఉంది. బహిరంగ విచారణ, సాక్ష్యాల పరిశీలన, వాదోపవాదాల ద్వారానే అసలు నిజం బయటపడుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Brett Eagleson
‘ముగిసిన అధ్యాయంగా భావిస్తున్నారు’
గ్వాంటనామోలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందని చెప్పిన బ్రెట్ ఈగల్సన్, అక్కడ జరిగే ప్రీ ట్రయల్ ప్రొసీడింగ్స్‌కు తాను హాజరుకాలేదని అన్నారు.
" అమెరికా ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందనే ఆవేదన నన్ను వెంటాడుతోంది" అని చెప్పారు. "ఈ విచారణకు సంబంధించిన ప్రతి దశను వారు అస్తవ్యస్తం చేశారు" అని అభిప్రాయపడ్డారు.
దాడులు జరిగి 25ఏళ్లు గడిచిపోయినప్పటికీ 9/11 ఘటన తన జీవితంలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది, సాధారణ ప్రజలకు మాత్రం ఇదో చారిత్రక విషయం అని ఈగల్సన్ వాపోయారు.
" ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకున్నాం. ఇరాక్ నుంచి బయటపడ్డాం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ముగిసింది. కాబట్టి ఆ అధ్యాయం ముగిసిపోయిందని ప్రజలు భావిస్తున్నారనిపిస్తోంది " అని ఈగల్సన్ పేర్కొన్నారు.
గ్వాంటనామోలోని సైనిక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైతే అది ఏడాదిపాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
"ఏ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు"అనేది నిర్ణయించడమే ప్రీ ట్రయల్ అని ప్రొఫెసర్ కేసీ మెక్‌కాల్ -స్మిత్ వివరించారు.
"ఒక వేళ ఆ విషయాలపై ముందే అంగీకారం కుదిరితే, విచారణ ప్రక్రియను మరింత వేగంగా నిర్వహించవచ్చు " అని ఆమె తెలిపారు.
9/11 ఘటనకు మరో ఏడాది పూర్తి అవుతున్న వేళ గ్వాంటనామో గురించి ఆలోచించే పరిస్థితి ఉండకూడదని, అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటున్నట్టు గెర్హార్డ్ అభిప్రాయపడ్డారు.
"నేను తిరిగి మరోసారి రాకూడదని కోరుకునే ప్రదేశం ఇది. నా జీవితం నేను ఆనందంగా, నాకు నచ్చిన పనులు చేసుకుంటూ, రాల్ఫ్ జ్ఞాపకాలతో జీవించాలని కోరుకుంటున్నా" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























