‘తల్లిదండ్రులను చంపిన’ యువతి ఆత్మహత్య.. ‘ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా’ అంటూ లేఖ

సురేఖ Surekha

ఫొటో సోర్స్, Sangareddy police

ఫొటో క్యాప్షన్, సురేఖ

(ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉండొచ్చు)

2026 జనవరి 24

వికారాబాద్ జిల్లా బంట్వారం మండల యాచారంలో దశరథ్, లక్ష్మి ఇంట్లో చనిపోయారు.

జనవరి 28

కుమార్తె సురేఖ వారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఆగస్టు 23

సంగారెడ్డిలో హాస్టల్‌లో సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

తల్లిదండ్రులను హత్య చేశారన్న ఆరోపణలపై నక్కలి సురేఖను వికారాబాద్ జిల్లా పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు.

ఈ ఘటన అప్పట్లో తెలంగాణలో సంచలనం రేపింది.

తాజాగా సురేఖ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

''హాస్టల్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆగస్టు 23 సాయంత్రం మాకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా సురేఖ అని తేలింది'' అని సంగారెడ్డి పట్టణ సీఐ రాము నాయుడు బీబీసీతో చెప్పారు.

సురేఖ మృతదేహం పక్కన పడి ఉన్న కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తల్లిదండ్రుల హత్య

సురేఖ తన తల్లిదండ్రులు నక్కలి దశరథ్, లక్ష్మిలను జనవరి 24న హత్య చేసినట్లు వికారాబాద్ పోలీసులు చెప్పారు.

అప్పట్లో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం...

బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్, లక్ష్మి దంపతులకు కుమార్తె సురేఖ, కుమారుడు అశోక్ ఉన్నారు.

సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవారు. అశోక్ వికారాబాద్‌లో ఉంటున్నారు.

తల్లిదండ్రులిద్దరూ చనిపోయారంటూ సురేఖ ఈ ఏడాది జనవరి 24న రాత్రి తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి చెప్పారు.

''నాన్న ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. అది చూసి అమ్మకు గుండెనొప్పి వచ్చింది'' అని ఆమె అశోక్‌తో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే, తల్లిదండ్రులు మృతిచెందిన తీరుపై అనుమానంతో అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

''సురేఖ ప్రేమ వ్యవహారంపై తరచూ గొడవలు జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది'' అని ఎస్ఐ విమల బీబీసీతో చెప్పారు.

ఇంట్లో సోదా చేస్తే రెండు ఇంజెక్షన్లు, వాటిలో రక్తం కనిపించిందని వెల్లడించారు పోలీసులు.

ఒళ్లు నొప్పులు తగ్గేందుకు అని నమ్మించి తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

సురేఖకు 2025లో ఇన్‌స్టాగ్రామ్‌లో సంగారెడ్డికి చెందిన యువకుడితో పరిచయం, ఆ తర్వాత ప్రేమకు దారి తీసిందని వికారాబాద్ జిల్లా పోలీసులు చెప్పారు.

ఇద్దరి కులాలూ వేరు కావడంతో పెళ్లి వద్దని చెప్పినందుకే తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవాలని సురేఖ నిర్ణయించుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఎస్ఐ విమల వెల్లడించారు.

సురేఖ

ఫొటో సోర్స్, Sangareddy police

ఫొటో క్యాప్షన్, సురేఖ

జులై 31న బెయిలుపై విడుదల

తల్లిదండ్రులను చంపారనే ఆరోపణలపై జైలుకు వెళ్లిన సురేఖ.. ఈ ఏడాది జులై 31న బెయిల్‌పై విడుదలయ్యారు.

ఆ తర్వాత ఆమె తన అన్న అశోక్ సాయంతో సంగారెడ్డిలో హాస్టల్‌లో చేరారని సంగారెడ్డి పోలీసులు చెప్పారు.

''సొంతూరు వెళితే బంధువులు, చుట్టుపక్కల వారిని ఎదుర్కోలేక సంగారెడ్డికి వచ్చి హాస్టల్‌లో ఉంటున్నారు'' అని సీఐ రాము నాయుడు చెప్పారు.

కుటుంబ సభ్యులు, ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బీబీసీతో చెప్పారాయన.

ఈ విషయంపై సురేఖ అన్న అశోక్‌ను సంప్రదించేందుకు బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

సూసైడ్ నోట్‌లో ఏముందంటే..

సురేఖ రాసినట్లుగా చెబుతున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

''ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోయా. ఐ మిస్ యూ అన్న బంగారం.

హెల్త్ ముందుగా చూపించుకో. అన్నయ్యా.. నువ్వు హ్యాపీగా ఉండు. నా చావుకు కారణం ఎవరూ లేరు'' అని సూసైడ్ నోట్‌లో రాసి ఉందని పోలీసులు చెప్పారు.

''నాకు లైఫ్‌లో చాలా బతకాలి.. ఎంజాయ్ చేయాలి.. అందరితో హ్యాపీగా ఉండాలని ఉంది, బట్ దేవుడు నాకు ఆ రాత రాయలేదు'' అని అందులో ఉన్నట్లుగా వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)