నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?

రూపా రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన కల్లు రూపా రెడ్డి

(హెచ్చరిక: కలవరపరిచే వివరణలు)

'బాబూ' - ఈ ఒక్క మాటే ఒక దారుణ హత్యకు సంబంధించిన నిందితులను పట్టించిందని, తమ దర్యాప్తుకు మార్గం చూపించిందని పోలీసులు చెబుతున్నారు.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశామని నల్గొండ పోలీసులు ప్రకటించారు.

‘‘జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం ప్రిన్సిపల్‌ను దారుణంగా హతమార్చారు. చోరీ చేయడానికి వెళ్లిన తమను ప్రిన్సిపల్ గుర్తు పట్టడంతో ఆమెను హత్య చేశారు ’’ అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

నల్లగొండ జిల్లాలోని మండల కేంద్రమైన కొండమల్లేపల్లిలో ని జేబీ కాలనీలో రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డితో కలిసి నివసిస్తున్నారు.

నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ పాఠశాలను మరో భాగస్వామి రాణిరెడ్డితో కలిసి రూపారెడ్డి నడుపుతున్నారు. పాఠశాలకు రూపారెడ్డే ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆగస్టు 11న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లాక ఆమె హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ హత్యకు సంబంధించి ఆగస్టు 12న కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో 150/26 నంబరుతో కేసు ఫైల్ చేశారు.

హత్య జరిగిన సమయంలో రూపారెడ్డి ఒంటరిగా ఉండగా, ఆమె భర్త రాజేందర్ రెడ్డి పనిపైన హైదరాబాద్ వెళ్లారు.

రూపా రెడ్డి ఇల్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రూపారెడ్డి ఇంటి ముందు జనం

వేర్వేరు కోణాల్లో దర్యాప్తు

రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు తొలుత తగిన ఆధారాలు లభించలేదు.

ఒక యువకుడు రెడ్ కలర్ షర్ట్ (హుడీ) వేసుకుని హత్య జరిగిన ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరగడం సీసీ కెమెరాల్లో కనిపించడంతో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.

‘‘దాదాపు 80 మంది అనుమానితులను విచారించడంతోపాటు 70 సీసీ కెమెరాలను పరిశీలించామని’’ ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు.

ఆస్తి తగదాలు, కుటుంబ వివాదాలు, అంతర్ రాష్ట్ర ముఠాల దోపిడీ.. ఇలా వేర్వేరు కోణాల్లో పరిశోధన జరిపామని ఆయన తెలిపారు.

రూపారెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఆ మాటే దర్యాప్తులో కీలకం

రూపారెడ్డి హత్యకు గురవడానికి ముందు ఆమె చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తన చిన్నమ్మతో మాట్లాడుతూ హఠాత్తుగా ఎవరినో ఎదురుగా చూసినట్టు ‘బాబూ’ అన్నారని, ఆ తరువాత రూపారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు చిన్నమ్మ పోలీసులకు చెప్పారు.

అయితే రూపారెడ్డి తాను ఎవరినో చూసినట్టు ‘బాబూ’ అని పిలవడమే తమకు దారిచూపిందని పోలీసులు తెలిపారు.

సాధారణంగా స్కూల్ విద్యార్థులను ఎక్కువగా ఆమె 'బాబు' అని సంబోధిస్తుంటారని పోలీసులకు రూపారెడ్డి కుటుంబీకులు చెప్పారు.

ఈ క్రమంలో పోలీసులు ఈ హత్యలో విద్యార్థుల ప్రమేయం ఏమైనా ఉందా.. అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు

కేసు చిక్కుముడి ఎలా వీడిందంటే...

రూపారెడ్డి మృతికి సంతాపంగా స్కూల్‌కు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.

''స్కూల్ రీఓపెన్ అయ్యాక 13 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. వారిలో పదో తరగతి చదువుతున్న ఐదుగురిపై అనుమానం వచ్చి విచారించాం. వారి నేపథ్యమేమిటో ఆరా తీస్తున్న సమయంలో రూపారెడ్డి చనిపోయిన తర్వాత ఇద్దరు విద్యార్థులు బాగా డబ్బు ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చినట్టు తేలింది. వారిని పట్టుకుని విచారించగా మొదట తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు. తర్వాత రూపారెడ్డిని హత్య చేసినట్టు ఒప్పుకొన్నారు'' అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు.

నిందితుల్లోని మొదటి విద్యార్థి దగ్గర లక్షా 54వేలరూపాయల నగదు, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఆ విద్యార్థి ఈ ఐఫోన్‌ను 60వేలరూపాయలకు కొన్నట్టు తెలిపారు.

విద్యార్థులు మైనర్లు కావడంతో వారి వివరాలు పోలీసులు బయటపెట్టలేదు. వారి ఊరు, కుటుంబ వివరాలను కూడా వెల్లడించలేదు. దీంతో వారి కుటుంబీలను సంప్రదించడానికి బీబీసీకి వీలుపడలేదు.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు
ఫొటో క్యాప్షన్, ఇంటి వెనకవైపు మట్టికుప్పలు, రాళ్లు ఉన్నాయి.

మట్టికుప్పలపై నుంచి ఇంట్లోకి ప్రవేశించి..

ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించగా, మరొకరు ఇంటి బయట కాపలాగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

కొండమల్లేపల్లి జేబీ కాలనీలోని రూపారెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ రెండు వైపులా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఇంకోవైపు రోడ్డు, మరోవైపు ఇల్లు ఉన్నాయి.

ఇంటి వెనుకవైపు మట్టికుప్పలు, రాళ్లు వేసి ఉన్నాయి. వాటిపై నుంచే నిందితుడిగా చెబుతున్న విద్యార్థి లోపలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఉన్న కిచెన్ డోర్ లోంచి లోపలకు ప్రవేశించి ఘాతుకానికి పాల్పడినట్టు చెబుతున్నారు.

ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. అయితే విద్యార్థి ప్రవేశించిన వైపు ఉన్న సీసీ కెమెరాను కొన్ని రోజుల క్రితం మరోవైపు తిప్పినట్టు ప్రస్తుతం స్కూల్ నిర్వహణ చూస్తున్న జార్జి రెడ్డి చెప్పారు.

అక్కడ ఉంచిన నిర్మాణ సామగ్రి పర్యవేక్షణకు సీసీ కెమెరాను అటువైపు తిప్పామని ఆయన చెప్పారు. దీంతో కిచెన్ డోర్ ఉన్న వైపు దృశ్యాలు రికార్డు కాలేదు.

కానీ నిందితుడైన విద్యార్థి దృశ్యాలు సమీపంలోని ఇళ్లలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

బీబీసీ వెళ్లినప్పుడు రూపారెడ్డి హత్యకు గురైన ఇంట్లో ఎవరూ అందుబాటులో లేరు. ఆమె అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాల్లో కుటుంబీకులు బిజీగా ఉన్నట్టు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ

"స్వాధీనం చేసుకున్న నోట్లపై రక్తపు మరకలు"

విద్యార్థి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయని, వాటిని ల్యాబ్‌కు పంపించినప్పుడు అది మనిషి రక్తంగా నిర్ధరణ అయ్యిందని మీడియాకు ఎస్పీ చెప్పారు.

రూపారెడ్డి హత్యకు దాదాపు 15-20 రోజుల కిందట జరిగిన ఓ ఘటన కూడా హత్యకు ఓ కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

''పాఠశాల హాస్టల్‌లో ఉండే నిందితుల్లోని ఓ విద్యార్థి బ్యాగ్‌లో సెల్‌ఫోన్, డబ్బు లభించడంతో అతన్ని హాస్టల్ నుంచి డేస్కాలర్‌గా మార్చారు. అతను మద్యం వంటి వ్యసనాలకు అలవాటుపడి జల్సాల కోసం ఏదోలా డబ్బు సంపాదించాలని భావించాడని మా విచారణలో తేలింది. ఆ క్రమంలోనే డే స్కాలర్‌గా మార్చిన కోపాన్ని మనసులో పెట్టుకుని ప్రిన్సిపల్ ఇంట్లో దొంగతనం చేయాలని మరో విద్యార్థితో కలిసి ప్రణాళిక వేసుకున్నారు'' అని ఎస్పీ చెప్పారు.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఒక విద్యార్థి ఇంటి బయట ఉంటే మరో విద్యార్థి లోపలికి వెళ్లాడని పోలీసులు చెప్పారు.

"నాలుగైదు రోజులపాటు రెక్కీ"

హత్య జరగడానికి ముందు నాలుగైదు రోజులపాటు నిందితులు రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు.

"ఆగస్టు 11నాటికి స్కూల్ ఫీజులు వసూలు అవుతాయని గుర్తించి దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నారు. హత్యకు ముందు కత్తి, గ్లౌజులు, మాస్కులు కొన్నారు. కొండమల్లేపల్లి శివారులో కలుసుకున్నారు. స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రం రూపారెడ్డి ఇంటికి రావడం గమనించి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక విద్యార్థి ఇంటి బయట ఉంటే మరో విద్యార్థి లోపలికి ప్రవేశించాడు.

ఇంట్లో డబ్బులు తీసుకుని వెళ్లే క్రమంలో రూపారెడ్డి గుర్తుపట్టి అరిచేసరికి ఆమెను తన వద్ద ఉన్న కత్తితో పొడిచాడు. ఆ క్రమంలో ఆమె వద్ద ఉన్న ఫోన్ కిందపడితే కొన ఊపిరితో ఉంటే ఫోన్ చేసి ఎవరికైనా వివరాలు చెబుతారనే ఉద్దేశంతో ఆ విద్యార్థి ఆమె ఫోన్ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు'' అని ఎస్పీ వివరించారు.

ఇద్దరూ దొంగతనానికి వెళ్లారని గుర్తుపట్టేసరికి ఆ విద్యార్థి భయంతో హత్యచేశాడని ఎస్పీ చెప్పారు.

త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలనే విషయంపై ఇద్దరు విద్యార్థులు యూట్యూబ్‌లో వెతికినట్టు తమ విచారణలో తేలిందని చెప్పారు. నెల రోజుల కిందట వారు గోవా ట్రిప్‌కు కూడా వెళ్లారని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూపారెడ్డి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు
ఫొటో క్యాప్షన్, ఆగస్టు 6,7 తేదీల్లో రూపారెడ్డితో చివరిసారి మాట్లాడామని స్కూల్ నిర్వహణలో భాగమైన రాణిరెడ్డి భర్త చెప్పారు.

1999 నుంచి స్కూల్ నిర్వహణలో రూపారెడ్డి

నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌ను రూపారెడ్డి, రాణిరెడ్డి కలిసి 1999లో కొండమల్లేపల్లిలో ప్రారంభించారు. వీరిద్దరూ గతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. అక్కడ మానేసి పాఠశాలను స్థాపించారు.

''మాకు స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు రూపారెడ్డి కూడా ముందుకు వచ్చారు. అప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నాం'' అని రాణిరెడ్డి చెప్పారు.

రాణిరెడ్డి భర్త, గతంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైరైన జార్జిరెడ్డితో బీబీసీ మాట్లాడింది.

''మాకు చిన్నప్పట్నుంచి రూపారెడ్డి తెలుసు. అందుకే స్కూల్ పెట్టాలని భావించినప్పుడు ఆమెతో కలిసి నా భార్య రాణిరెడ్డి పాఠశాల ప్రారంభించారు. గతంలో హాస్టల్ నిర్వహించేవాళ్లం. కానీ కరోనా తర్వాత హాస్టల్ నిర్వహణ కొన్నాళ్లు ఆపేశాం. మళ్లీ రెండేళ్ల క్రితం హాస్టల్ ప్రారంభించి ఆ బాధ్యతలు ఇద్దరు ఉపాధ్యాయులకు అప్పగించాం'' అని ఆయన చెప్పారు.

చివరిసారిగా తమతో ఆగస్టు 6-7 తేదీల్లో రూపారెడ్డి మాట్లాడారని, తర్వాత తమ సోదరుడు చనిపోవడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నామని జార్జిరెడ్డి చెప్పారు.

''ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. ఘటన జరిగిన మరుసటిరోజు ఉదయం రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో షాకయ్యాం.

విద్యార్థులే దారుణానికి పాల్పడ్డారని తెలిసి ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. రూపారెడ్డి విద్యార్థులను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూసుకునేవారు'' అని రూపారెడ్డిని తలచుకుని బాధపడ్డారు జార్జిరెడ్డి.

విద్యార్థి, హత్య, మానసిక ప్రవర్తన, నేరాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిందితుల్లో ఒకరైన విద్యార్థి గతంలో హాస్టల్‌లో ఉండేవాడు.

''పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి''

కాండక్ట్ డిజార్డర్ వల్ల చిన్న వయసులోనే పిల్లల్లో విపరీత ధోరణులు పెరుగుతుంటాయని హైదరాబాద్‌కు చెందిన కౌన్సెలింగ్ సైకాలజిస్టు అనిత ఆరె బీబీసీతో చెప్పారు.

''చిన్నప్పట్నుంచి ఏదీ కావాలన్నా ఇవ్వడం మంచిది కాదు. దానివల్ల ఏదైనా దొరక్కపోతే విపరీత ప్రవర్తనవైపు మళ్లే ప్రమాదం ఉంది. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనేది చిన్నప్పట్నుంచి చెబుతుండాలి. ఏ వస్తువైనా కష్టపడితేనే సంపాదించుకోగలం, సులువుగా ఏదీ రాదు అనే విషయాన్ని వివరించాలి'' అని అనిత తెలిపారు.

క్రమశిక్షణ విషయంలో బాధ్యత తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు అందరికీ ఉండాలని, అందరూ పర్యవేక్షిస్తూ ఉండాలని అనిత ఆరె చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)