కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అలోక్ పుతుల్, జహంగిర్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం (జులై 31) సాయంత్రం తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు మరణించారు.
ఇద్దరు కూలీలు కేలమ్ ప్రాంతంలోని ఒక ఇటుక బట్టీలో పనిచేసేవారు. మృతులను దీపక్ రాత్రే, భూపేంద్ర భైనాగా గుర్తించినట్లు కుల్గాంకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
దీపక్ అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు.
తీవ్రంగా గాయపడ్డ భూపేంద్రను మొదట అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారని, అక్కడి నుంచి శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం(ఆగస్టు 1) మరణించినట్లు అధికారులు తెలిపారు.
చీకటిగా ఉండడంతో కాల్పులు జరిపిన అనుమానితులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. భద్రతా దళాలు ఆ ప్రాంతమంతటినీ చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.

జమ్మూ కశ్మీర్ పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అలాగే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.
కాల్పుల ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 'ఎక్స్'లో స్పందించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్‌తో పాటు, ఇతర ఉన్నత భద్రతా అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు.
"గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఉగ్రవాదులను నిర్మూలించాలని భద్రతా దళాలను ఆదేశించాను" అని లెఫ్టినెంట్ గవర్నర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Alok Putul/BBC
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
మరణించిన ఇద్దరు వలస కూలీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.
స్థానిక అధికార యంత్రాంగం నుంచి ఒక్కొక్కరికి ఆరులక్షల రూపాయల తక్షణ సాయంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌లో జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
"ఇది నిజంగా చాలా దురదృష్టకరం. జీవనోపాధి కోసం వారు బయటి నుంచి కశ్మీర్‌లో పనిచేయడానికి వచ్చారు. అలాంటి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిని ఎంత ఖండించినా సరిపోదు" అని బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ ఒమర్ అబ్దుల్లా అన్నారు.
''మృతుల కుటుంబాల దుఃఖాన్ని డబ్బు తగ్గించలేదు. కానీ, ఈ కష్ట సమయంలో వారికి సాయపడటానికి మా వంతుగా ఇది ఒక చిన్న ప్రయత్నం'' అని ఆయన అన్నారు.
మరణించిన ఇద్దరు కూలీల కుటుంబాలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందిస్తుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్‌ను గుర్తుతెలియని దుండగులు గత నెలలో మొదట్లో కాల్చి చంపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆషిక్ హుస్సేన్ బడ్గామ్ జిల్లాకు చెందినవారు.

ఫొటో సోర్స్, Alok Putul/BBC
కశ్మీర్‌లోనే అంత్యక్రియలు
ఇద్దరు వలస కూలీల మృతదేహాలకు శనివారం కశ్మీర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
మరణించిన ఇద్దరిలో ఒకరైన 21 ఏళ్ల దీపక్ రాత్రేది సక్తీ జిల్లాలోని బుందేలీ గ్రామం. 28 ఏళ్ల భూపేంద్ర భైనా సారంగఢ్-బిలాయిగఢ్ జిల్లాలోని ఛుయిహా గ్రామానికి చెందినవారు.
శుక్రవారం(జులై 31) రాత్రి పొద్దుపోయాక పోలీసుల ద్వారా దీపక్ కుటుంబానికి ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి బుందేలీ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
"మేము చాలా పేదవాళ్లం. దీపక్ దాదాపు ఏడాది కిందట తన భార్య, రెండేళ్ల కొడుకుతో కలిసి ఇటుకల బట్టీలో పని చేయడానికి కశ్మీర్ వెళ్లారు'' అని దీపక్ రాత్రేకు దగ్గరి బంధువైన లక్ష్మణ్ రాత్రే చెప్పారు.
దీపక్ తండ్రి గతంలోనే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో దీపక్ తల్లి, తమ్ముడు ఉంటున్నారు. ఆయన తమ్ముడు వికలాంగుడు కావడంతో కుటుంబ బాధ్యత మొత్తం దీపక్ చూసుకునేవారు.
భూపేంద్ర భైనా కుటుంబానికి గ్రామస్థుల ద్వారా ఆయన మరణవార్త తెలిసింది. భూపేంద్ర మూడు నెలల క్రితమే ఉపాధి కోసం భార్యతో కలిసి కశ్మీర్‌కు వెళ్లారు.
ఆయన తన రెండేళ్ల కొడుకును సమీప గ్రామంలోని బంధువుల ఇంట్లో వదిలివెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.
"కుటుంబం మొత్తం ఆయనపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆయన లేకపోవడంతో, ఆయన కొడుకు, చెల్లెలు, నానమ్మ పరిస్థితేమిటని మేమంతా ఆందోళన చెందుతున్నాం" అని గ్రామ సర్పంచ్ ధనీరామ్ బంజారే అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి వెతుక్కుంటూ జమ్మూకశ్మీర్, పంజాబ్, హరియాణాతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంటారు.
వారిలో అధిక శాతం ఇటుక బట్టీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేస్తారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడంతో అనేక కుటుంబాలు ఈ వలసలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Muneeb-ul-Islam
విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
జమ్మూ కశ్మీర్‌లోని అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు.
"దీనిపై విచారణ జరిపి, దాడి చేసిన వారిని గుర్తించాలి. రాష్ట్ర హోదా కోసం చర్చ వచ్చిన ప్రతిసారీ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు" అని అన్నారు.
కుల్గాం దాడి పహల్గాం దాడి లాంటిదేనని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ వ్యాఖ్యానించారు.
"అక్కడ ప్రజలను వారి మతం గురించి అడిగి చంపారు. ఇక్కడ వారి స్వస్థలం, కులం ఏంటని అడిగి, ఆ తర్వాత వారిని చంపారు" అని ప్రమోద్ తివారీ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
''ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రధాన మంత్రి, హోంమంత్రి ఇచ్చిన హామీ ఎక్కడ? భద్రత ఉంటుందని నమ్మి కూలీలు అక్కడికి వెళ్లారు. ప్రభుత్వం దీనిని క్షమాపణ చెప్పి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం అందించాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
"అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణ జరగాలి" అని జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన పార్టీల్లో ఒకటైన పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
"ఈ ఘటనను సాకుగా చూపి, ఓవర్‌గ్రౌండ్ వర్కర్లుగా ముద్రవేసి సాధారణ కశ్మీరీలను లక్ష్యంగా చేసుకోకూడదు. సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు ఉన్నప్పటికీ ఉగ్రవాదులు నిరాయుధులైన ఇద్దరిని ఎలా చంపగలిగారో ప్రభుత్వం విచారణ జరపాలి" అని డిమాండ్ చేశారు.
"భద్రతా ఏర్పాట్లలో లోపం జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ భద్రతా లోపం ఎక్కడ జరిగిందో ప్రభుత్వం విచారణ జరపాలి" అని మెహబూబా ముఫ్తీ అన్నారు.
''కేవలం 10 రోజుల్లో ఇది రెండో దాడి. ఇది భద్రతా దళాల అప్రమత్తత, నిఘా సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిఘా సంస్థలు, పోలీసులు, సీఆర్పీఎఫ్ లేదా ఇక్కడున్న మరే ఇతర భద్రతాదళాలైనా మరింత అప్రమత్తంగా ఉండాలి" అని జమ్మూ కశ్మీర్ బీజేపీ నాయకుడు అల్తాఫ్ ఠాకూర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
''శాంతిభద్రతలను దెబ్బతీయాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరింత అప్రమత్తత అవసరం. అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, కశ్మీర్ వంటి ప్రాంతంలో రెండు ఉగ్రవాద దాడులు జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నప్పుడు, పర్యటక రంగం బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఉండడం సరైనది కాదు" అని అల్తాఫ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























