‘ఖమేనీ కోసం ప్రాణత్యాగం చేస్తామని మేం చెప్పేవాళ్లం, చివరకు ఆయన మా కోసం ప్రాణాలు విడిచారు’

అయతొల్లా ఖమేనీ, అంత్యక్రియలు, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, అలెక్స్ ఫిలిప్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అంతిమ సంస్కార కార్యక్రమాల్లో భాగంగా, తొలిరోజు ఆయనకు నివాళులర్పించేందుకు ఇరానీయులు నల్లని దుస్తులు ధరించి తెహ్రాన్‌లోని ప్రధాన మసీదు వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అయతొల్లా అలీ ఖమేనీ భౌతికకాయాన్ని ఖమేనీ సొంత పట్టణం మషద్‌లో వచ్చే గురువారం(ఈ నెల 9వ తేదీ) ఖననం చేయనున్నారు.

రానున్న రోజుల్లో ఇరాన్, ఇరాక్‌లో జరిగే అంత్యక్రియల కార్యక్రమాలకు ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల మంది హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుగా పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నినదించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అయతొల్లా ఖమేనీ, అంత్యక్రియలు, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరు మరణించారు.

'మేం మంచివాళ్లం కాబట్టి..'

''అంత్యక్రియల కార్యక్రమానికి మేమెందుకొచ్చామంటే చివరి వరకు ఆయన వెంట నిలుస్తామని ఆయనకు వాగ్దానం చేశాం. చాలా కాలం నుంచి మా నాయకుడి కోసం ప్రాణత్యాగం చేస్తామని మేం చెబుతూ వచ్చాం. చివరకు ఆయన మా కోసం ప్రాణత్యాగం చేశారు'' అని 37 ఏళ్ల ప్రొఫెసర్ రెజా గ్రాండ్ మొసల్లా ప్రాంగణంలో న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో చెప్పారు.

''ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ సుప్రీం లీడర్ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. మా నాయకుడు చెప్పినట్టు అమెరికాతో మాకు రక్తంలోనే వైరం ఉంది. ఆ దేశంతో మా సంబంధాలెప్పుడూ మంచిగా ఉండవు'' అని 40 ఏళ్ల అరాష్ రహిమి రాయిటర్స్‌తో చెప్పారు.

ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఇది భారీ ప్రాంతీయ సంక్షోభంగా మారింది.

శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''మేం మంచివాళ్లం కాబట్టి.. అంత్యక్రియల కోసం ఇరాన్‌కు ఓ వారం విరామం ఇస్తున్నాం'' అని ఈ నెల 3న ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయతొల్లా ఖమేనీ, అంత్యక్రియలు, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఖమేనీ భౌతికకాయాన్ని మూడు రోజుల పాటు గ్రాండ్ మొసల్లాలో ఉంచనున్నారు.

ఆరు రోజుల కార్యక్రమాల తర్వాత ఖననం

అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతుండడంతో తెహ్రాన్‌లోని ప్రధాన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

గ్రాండ్ మొసల్లాలో ఖమేనీ భౌతికకాయాన్ని మూడు రోజుల పాటు ఉంచుతారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఖమేనీ ఇతర కుటుంబ సభ్యుల మృతదేహాలను కూడా అక్కడే ఉంచుతారు.

రాజధాని వెలుపల మరో మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ నెల 7న ఖమేనీ భౌతికకాయాన్ని తెహ్రాన్‌కు దక్షిణాన్న ఉన్న కుమ్ నగరానికి తరలిస్తారు. జమ్‌కరన్‌ మసీదులో సీనియర్ షియా మతపెద్ద నేతృత్వంలో అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతాయి.

అయతొల్లా ఖమేనీ, అంత్యక్రియలు, ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

మొజ్తబా హాజరవుతారా?

తర్వాత రోజు అయిన ఈ నెల 8న, భౌతికకాయాన్ని ఇరాక్‌లోని నజఫ్‌కు తరలిస్తారు. షియా ఇస్లామ్ మొదటి ఇమామ్ అలీ సమాధి ప్రాంగణంలో అంతిమయాత్ర నిర్వహిస్తారు. తర్వాత కర్బలాలో కార్యక్రమాలు కొనసాగుతాయి. తర్వాత ఖమేనీ భౌతికకాయాన్ని తిరిగి ఇరాన్‌కు తరలిస్తారు.

మషద్‌లో షియా ఇస్లాం ఎనిమిదో ఇమామ్ సమాధి ఉన్న ప్రాంగణంలో ఖమేనీ భౌతికకాయాన్ని ఈ నెల 9న ఖననం చేస్తారు.

ఆరు రోజుల అంతక్రియల కార్యక్రమాల తర్వాత దేశవ్యాప్తంగా మరో 40 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేసిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమం వరకు వివిధ స్మారక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.

ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.

ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా హాజరవుతారా లేదా అన్నదానిపై అందరి దృష్టి నెలకొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)