మూడో బిడ్డను కంటే ఏడాది ప్రసూతి సెలవు.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నందిని వెల్లస్వామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ప్రభుత్వ ఉద్యోగినులు మూడో బిడ్డను కనేటప్పుడు ప్రసూతి సెలవును ఇక నుంచి ఏడాదికి పెంచుతున్నట్లు తమిళనాడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శరత్ కుమార్ ప్రకటించారు.
మంత్రి ప్రకటనను తమిళనాడులో జననాల రేటును పెంచే దిశగా తీసుకున్న ముందడుగుగా పలు వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురాకుండా ఇలాంటి ప్రోత్సాహక పథకాల వల్ల ఫలితం ఉండదని నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
మరోవైపు, ఇది పిల్లలు కనడాన్ని ప్రోత్సహించే పథకం కాదని, సుదీర్ఘ దృష్టితో తీసుకున్న నిర్ణయమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికార ప్రతినిధి శశిరేఖ తెలిపారు.
ఇంతకీ, ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా ఏడాది ప్రసూతి సెలవు ఇవ్వడంపై ఎందుకు చర్చ జరుగుతోంది?


ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు 18న తమిళనాడు మంత్రి శరత్ కుమార్ ఆ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, "తమిళనాడు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు కానుంది" అని ప్రకటించారు.
ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మొదటి ఇద్దరు పిల్లల డెలివరీకి ఇచ్చే ప్రసూతి సెలవును వివిధ దశల్లో పెంచుతూ ప్రస్తుతం 365 రోజులకు చేర్చారు. ప్రస్తుతం, మూడో బిడ్డకు జన్మనిచ్చే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా అదే స్థాయిలో ప్రసూతి సెలవు ప్రయోజనం లభించేలా మంత్రి ప్రకటన అవకాశం కల్పించింది. మూడో బిడ్డకు జన్మనిస్తే ఇప్పటివరకు 12 వారాల ప్రసూతి సెలవు ఇస్తున్నారు.
ప్రారంభంలో మొదటి బిడ్డకే ప్రసూతి సెలవు 90 రోజులుగా ఉండేది, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని క్రమంగా 365 రోజులకు పెంచాయి.
ఈ ప్రకటనపై టీవీకే పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు లేవనెత్తారు.
"ప్రసూతి సెలవు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, పితృత్వ సెలవుల గురించి కూడా పరిశీలించాలి. అదే సమయంలో, కుటుంబాలు మూడో బిడ్డను కనడాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. మూడో బిడ్డను పెంచేంత ఆర్థిక స్థోమత ఆయా కుటుంబాలకు ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు.
" కొత్తగా తీసుకొచ్చే ఏ విధానమైనా సరే.. మూడో బిడ్డను కనాలని మహిళలపై పరోక్ష ఒత్తిడిని తీసుకురాకూడదు. ముఖ్యంగా ఫలానా జెండర్ బిడ్డే కావాలనే పట్టింపులు, సామాజిక ఒత్తిళ్లు ఎదుర్కొనే కుటుంబాల విషయంలో ఇది చాలా ముఖ్యం" అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
"మహిళలకు తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. పిల్లలకు దక్కాల్సిన సంరక్షణ అందాలి. ప్రభుత్వ విధానం ఈ రెండు వర్గాలను రక్షించేలా ఉండాలే తప్ప, ఎవరినీ ఇబ్బందులకు గురిచేసేలా ఉండరాదు" అని తెలిపారు.
మంత్రి శరత్ చేసిన ప్రకటనకు ముందే, తమిళనాడులో జననాల రేటును ప్రోత్సహించే పథకాల గురించి ఆలోచిస్తామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ తెలిపారు.
"తమిళనాడులో జననాల రేటు బాగా తగ్గిపోతోంది. పిల్లలు కనడాన్ని ప్రోత్సహించే విషయంపై ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. భార్యాభర్తలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పనిభారం, విశ్రాంతి లేమి మధ్య ఒక్క బిడ్డను కనడానికే ఆలోచిస్తున్నారు. ఇకముందు వారు పిల్లలను కనడం కోసమే సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది" అని కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో మంత్రి అరుణ్ రాజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు
భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయిందని ఈ ఏడాది జూన్‌లో విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్-2024 పేర్కొంది. దీన్ని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసింది.
రిపోర్ట్ ప్రకారం, 2024 సంవత్సరంలో జాతీయ స్థాయిలో భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9గా ఉంది. అంటే, భారతదేశంలో జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు పడిపోయింది.
స్టాటిస్టికల్ రిపోర్టు ప్రకారం, అత్యధిక సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ట్రాల్లో బిహార్ (2.9) అగ్రస్థానంలో ఉంది. అత్యల్పంగా దిల్లీలో ఈ రేటు 1.2గా నమోదైంది. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.3 స్థాయిలో ఉంది.
ఇదిలా ఉంటే, కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసి జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల నష్టపోతున్నాయని తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Tara Krishnaswamy
'అదనపు భారం'
"సంతానోత్పత్తి రేటు తగ్గడానికి పరిష్కారం వెతకడమే అనవసరం. ముఖ్యంగా, మహిళల్లో విద్య పెరిగి పేదరికం తగ్గినప్పుడు సహజంగానే జననాల రేటు తగ్గుతుంది. మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల మార్గంలోనే భారత్ పయనిస్తోంది. భారత్ లాంటి దేశంలో పిల్లలను, పెద్దలను చూసుకోవడం, ఇంటి పనులు చేయడం అనే బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే పడుతున్నాయి. ఎంతోమంది మహిళలు ఉద్యోగాలకు వెళ్తూనే ఇంటి పనుల భారాన్ని కూడా మోస్తున్నారు" అని రచయిత్రి, సామాజిక కార్యకర్త తారా కృష్ణస్వామి అంటున్నారు.
మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేసే 'పొలిటికల్ శక్తి' అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు.
టైం యూజ్ సర్వే ప్రకారం, 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రతిరోజూ ఏడు గంటలకు పైగా వేతనం లేని ఇంటి పనులకు, సంరక్షణ పనులకు వెచ్చిస్తున్నారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) చెబుతోంది. అదే పురుషులైతే 3 గంటల కంటే తక్కువే వెచ్చిస్తున్నారు. భారత పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే నిష్పత్తి కనిపిస్తోంది.
ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు కల్పించడం లాంటి ఆర్థిక మార్పులు తీసుకురావడం, పిల్లలను చూసుకోవడం స్త్రీ, పురుషులిద్దరి బాధ్యత అనే సామాజిక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలని తారా కృష్ణస్వామి సూచిస్తున్నారు.
"ఈ మార్పులు చేస్తే దానంతట అదే జననాల రేటు పెరుగుతుంది. అప్పుడు కొన్ని ప్రోత్సాహక పథకాలను ప్రకటించవచ్చు. కానీ, ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదు. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. ఆర్థిక పురోగతి లేకుండా మరో బిడ్డకు చదువుతో సహా ఇతర ఖర్చుల కోసం ఎక్కడికి వెళ్తారు?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రోత్సాహక పథకంగానే చూడాలని, అలా కాకుండా ఎక్కువ మంది పిల్లలను కనాలని బలవంతం చేస్తే మాత్రం ఖండించాలని తారా కృష్ణస్వామి తెలిపారు. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన పరిస్థితి వస్తే మహిళలు ఉద్యోగాల నుంచి బయటకు రావాల్సి వస్తుందని, దానివల్ల వారు విద్యలో వెనుకబడిపోయే ప్రమాదం కూడా ఉందన్నారామె.
జననాల రేటు తగ్గడం అనేది కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేయడం వల్ల జననాల రేటు భారీగా పడిపోయింది.
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ సగటున పురుషుల కంటే మహిళలు 2.6 రెట్లు ఎక్కువగా వేతనం లేని సంరక్షణ పనులు చేస్తున్నారు.
తమిళనాడు మాదిరే మరికొన్ని రాష్ట్రాలు కూడా పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు పథకాలను ప్రకటిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు పోటీ చేయకుండా నిషేధం విధించే నిబంధనను మూడు దశాబ్దాల తర్వాత 2024లో ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అంతేకాకుండా, మూడో బిడ్డను కనే వారికి, నాలుగో బిడ్డ కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Shanthi Ravindranath
'శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు'
అయితే, ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే మహిళలు శారీరకంగా, మానసికంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారని గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ చెబుతున్నారు.
"పిల్లల సంరక్షణ కోణంలో మూడో బిడ్డకు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే ప్రసూతి సెలవు లాంటివి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి. మహిళలు పిల్లలను కనే యంత్రాలు కారు. ఎక్కువ మందిని కనడాన్ని తగ్గించేందుకు అనేక చట్టాలు, నిబంధనలు అమలులో ఉన్నాయి" అని గైనకాలజిస్ట్ శాంతి అన్నారు.
కాగా, ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న మహిళలపై, మగ పిల్లాడి కోసం మళ్లీ గర్భం దాల్చాలని ఈ ప్రకటన అదనపు భారాన్ని, ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉందని స్త్రీవాద కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వంలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారని, వారిలో మహిళా ఉద్యోగులు సగం మంది ఉండవచ్చని శాంతి వివరిస్తూ, "అందులోనూ పిల్లలు కనే వయసులో ఉన్న యువతుల సంఖ్య, వారిలో మూడో బిడ్డను కనే వారి సంఖ్య చాలా తక్కువ" అన్నారు.
తమిళనాడు ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యం సహా పలు శాఖల్లో పనిచేసే వారిలో కాంట్రాక్ట్ మహిళా కార్మికులు చాలా ఎక్కువ ఉన్నారని ఆమె అంటున్నారు.
"వారిలో ఎక్కువ మందికి మొదటి బిడ్డకు కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవు లాంటి ఎలాంటి ప్రసూతి సదుపాయాలు కల్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వారికి ప్రసూతి సెలవులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి" అని శాంతి రవీంద్రనాథ్ అన్నారు.

ఫొటో సోర్స్, Sasirekha
'దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం'
అయితే, ఇది మహిళల సంక్షేమం కోసమే తీసుకున్న నిర్ణయమని, వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని టీవీకే అధికార ప్రతినిధి శశిరేఖ చెప్పారు.
"తమిళనాడులో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.3కి పడిపోయింది. కానీ, ఈ రేటు 2.1గా ఉండాలి. 15-20 ఏళ్లలో తమిళనాడు జనాభాలో భారీ మార్పు రాబోతోంది. భవిష్యత్తులో తమిళనాడులో వృద్ధులే ఎక్కువగా ఉంటారు. అలాగని, ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని దీని ద్వారా అనుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు అలాంటి అవసరం ఉంటే ప్రసూతి సెలవును వాడుకోవచ్చు" అని శశిరేఖ బీబీసీతో చెప్పారు.
"ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. అన్ని విధాలా అధ్యయనం చేసిన తర్వాతే తీసుకున్నారు" అన్నారు.
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు పడిపోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పిల్లలు కనడాన్ని ప్రోత్సహించడానికి చాలా దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
దక్షిణ కొరియాలో బిడ్డ పుట్టిన మొదటి ఎనిమిదేళ్లలోపు తల్లి, తండ్రి ఇద్దరూ ఏడాది పాటు సెలవు తీసుకునే హక్కును పొందారు. అయితే 2022లో కొత్తగా తండ్రులైన వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే తమ సెలవులో కొంత భాగాన్ని వాడుకున్నారు. అదే సమయంలో, కొత్తగా తల్లులైన వారిలో 70 శాతం మంది ఈ సెలవును ఉపయోగించుకున్నారు.
ఇక చైనాలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు లాంటి గర్భనిరోధక ఉత్పత్తులపై 13 శాతం విక్రయ పన్ను విధించారు. అదే సమయంలో, శిశు సంరక్షణ ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఫొటో సోర్స్, RS Neelakandan
'మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి'
జననాల రేటును పెంచడం తమిళనాడుకు అవసరమా లేదా అనేది ఆలోచించాలని 'సౌత్ వర్సెస్ నార్త్: ఇండియాస్ గ్రేట్ డివైడ్' పుస్తక రచయిత ఆర్.ఎస్. నీలకందన్ అంటున్నారు.
"నా వరకు ఇది అనవసరమైన విషయం. జనాభా తగ్గితే ఆర్థిక వృద్ధి తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ, మనం తలసరి ఆదాయాన్ని చూడాలి. జపాన్‌లో జనాభా తగ్గుతున్నప్పుడు వారి ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుంది. కానీ, వ్యక్తుల పరంగా చూస్తే వారు బాగానే ఉన్నారు. సామాన్యులకు తలసరి ఆదాయమే ముఖ్యం"అన్నారు.
"ఇలాంటి ప్రోత్సాహక పథకాలు ఇస్తే తమిళనాడు మహిళలు కచ్చితంగా మూడో బిడ్డను కంటారనేది ఏమీ లేదు. వారు విద్య, ఉపాధిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో, మూడో బిడ్డ గురించి పెద్దగా ఆలోచించరు. అయితే, ప్రసూతి సెలవు లాంటి విధానపరమైన నిర్ణయం తీసుకురావడం గురించి బాగా ఆలోచించి ఉండాల్సింది" అని ఆర్.ఎస్. నీలకందన్ అన్నారు.
ఈ ప్రకటన వల్ల, ప్రసూతి సెలవులో ఉండే ఏడాది పాటు మహిళా ఉద్యోగి స్థానంలో మరొకరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడితే.. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందా అని బీబీసీ అడిగితే, "దీనివల్ల పెద్దగా ఆర్థిక భారం పడదు" అని నీలకందన్ బదులిచ్చారు.
"మరొకరిని తాత్కాలిక ఉద్యోగిగా తీసుకుంటే ప్రభుత్వానికి కాస్త అదనపు ఖర్చు అయినా సరే, దీన్ని సామాజిక సంక్షేమ కోణంలోనే చూడాలి" అని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముత్తుకుమార్ అన్నారు.
15-20 ఏళ్లలో తమిళనాడు జనాభాలో పెను మార్పు వచ్చి, వృద్ధులే ఎక్కువగా ఉంటారన్న టీవీకే నాయకురాలు శశిరేఖ అభిప్రాయంతో ఆర్.ఎస్. నీలకందన్ ఏకీభవించడం లేదు.
"ఒక సమాజంలో పనిచేసేవారు, పనిచేయని వారి నిష్పత్తి దాదాపు సమానంగా ఉన్నప్పుడే ఇలాంటి సంక్షోభం తలెత్తుతుంది. జపాన్‌లో ఇంచుమించు ఈ పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులో ఇలాంటి పరిస్థితి రావడానికి చాలా తరాలు పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన చర్చల్లో కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేశామని చెబుతున్న మనమే, ఇకపై ఎక్కువ మంది పిల్లలను కంటామని చెప్పడం తిరోగమనమే అవుతుంది. దీన్ని విడిచిపెట్టి, విద్య, వైద్యం తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలి" అని ఆయన అన్నారు.
"భారత్‌లో మరీ తక్కువ జనాభా ఉంటేనే కష్టం. ప్రస్తుతం భారత్‌లో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో సగం మంది ఉన్నా సరే ఎన్నో అద్భుతాలు చేయగలం. ప్రస్తుత జననాల రేటు ఇలాగే కొనసాగితే.. ఇప్పుడు పుట్టిన ఒక బిడ్డ జీవితకాలం పూర్తయ్యేసరికి దేశ జనాభా 140 కోట్ల నుంచి 120 కోట్లకు పడిపోవచ్చు. దీనివల్ల పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు " అని నీలకందన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























