పవన్ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు?

ఫొటో సోర్స్, Janasena Media
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు మొత్తం 14 కేబినెట్ సమావేశాలు జరిగితే నాలుగు సమావేశాలలో మాత్రమే ఆయన ఉన్నారు.
మిగిలిన పది సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు.
అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారా అనే కోణంలో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే, ఇటీవల భుజానికి ఆపరేషన్ చేయించుకోవడం, తరుచూ అనారోగ్యం కారణంగా కేబినెట్ భేటీలకు పవన్ కల్యాణ్ హాజరుకావడంలేదని బీబీసీతో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

కేవలం అనారోగ్య కారణాల వల్లనే పవన్ రావడం లేదని, ఇందులో వేరే ఆలోచన అక్కర్లేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
అయితే, వరుసగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరు కావడం అనేది యాదృచ్ఛికం కాదని, దాన్ని పవన్ వ్యూహాత్మక రాజకీయ ధోరణిగానే చూడాలని సీనియర్ జర్నలిస్టు వి.వి.రమణమూర్తి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TDP Media
అసలు ఎందుకీ చర్చ మొదలైంది?
అమరావతిలో ఆగస్టు 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంతో పాటు స్థానిక సంస్థల కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా చట్టసవరణకు ఆమోదం తెలిపే కీలక అంశాల చర్చ ఈ సమావేశంలో జరిగింది.
ఆగస్టు 6వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశానికి పవన్ కల్యాణ్ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్–2026, ఏపీ పీపీపీ పాలసీ, రాజధానిలో వెయ్యి కోట్లతో ట్విన్ టవర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అనారోగ్య కారణాలవల్లే హాజరుకావడం లేదని జనసేన నేతలు, కార్యకర్తలు చెబుతున్నప్పటికీ, అదే రోజు అంటే ఆగస్టు 6వ తేదీన అల్లికల (క్రోచెట్ లెస్) కళాకారులకు కళ్లజోళ్లు అందజేసే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొనడాన్ని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
జనసేన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫోటో కూడా పోస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Chandrababu whatsappchannel
పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స..
అంతకుముందు జులై 10, జులై 23న జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు పవన్ రాలేదు.
జులై 10న కేబినెట్ సమావేశం జరిగిన మర్నాడు అంటే జులై 11న ముంబయిలోని ఓ ఆసుపత్రిలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. జులై 15వ తేదీన ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కొద్దిరోజులు ఆయనకి పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకున్నారు.
ఆ తర్వాత జులై 20వ తేదీన ఏపీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ తనను పరామర్శించేందుకు వచ్చిన జనసేన నేతలతో పాటు కార్యకర్తలతో పార్టీ సమావేశాలు నిర్వహించారు.
ఆ తర్వాత మూడు రోజులకు అంటే జులై 23న అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీకి పవన్ రాలేదు.
కేబినెట్ భేటీ జరిగిన జులై 23న ఆయన మంగళగిరి జనసేన క్యాంపు కార్యాలయంలో ఉన్నారని, మరుసటి రోజు జులై 24న మానవ, ఏనుగు సంఘర్షణలను అరికట్టేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో స్వాగతం పలికే కార్యక్రమంలో పవన్ పాల్గొన్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
కుంకీ ఏనుగుల కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జనసేన టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
పవన్ కల్యాణ్ గతంలో కూడా మంత్రివర్గ సమావేశాలకు పలుమార్లు హాజరుకాని కొన్ని సందర్భాలు ఉన్నాయి.
ఈ ఏడాది జూన్ 4వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరైనప్పటికీ మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆనాటి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ బయటకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.
అయితే తీవ్ర వెన్ను నొప్పి కారణంగా పవన్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని ఆ తర్వాత జనసేన వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత రోజు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని మూలపాడు గ్రామంలో నిర్వహించిన సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అక్కడ తన తల్లి అంజనాదేవి పేరిట పవన్ ఒక మొక్క నాటారు.
మొత్తంగా ఈ ఏడాదిలో జూన్ 4, మే 14, ఏప్రిల్ 10, జనవరి 8వ తేదీల్లో జరిగిన కేబినెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మిగిలిన పది సమావేశాలకు ఆయన రాలేదు.
జనసేన కార్యక్రమాలకు హాజరు, ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరు?
ఈ ఏడాది జనవరి 28న జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఆ రోజున ఆయన వ్యక్తిగత పనుల కారణంగా రాలేదని సమాచారం పంపినట్లు అప్పట్లో మీడియాల్లో వార్తలు వచ్చాయి.
ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. సీఆర్డీఏకి సంబంధించి పలు ప్రతిపాదనలకు ఈ మీటింగ్‌లో ఆమోదం తెలిపారు. ఆనాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కల్యాణ్ ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు.
అయితే తీవ్రమైన జ్వరంతో బాధపడటం వల్లే ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేక పోయారని అప్పట్లో జనసేన నేతలు తెలిపారు.
మార్చి 13న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్‌కు పవన్ కల్యాణ్ రాలేదు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ వేడుక నేపథ్యంలో బిజీగా ఉన్న కారణంగా ఆయన రాలేకపోయారని అప్పట్లో జనసేన వర్గాలు తెలిపాయి.
భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1న ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వచ్చారు. అప్పటికి కూడా ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న చేతికి కట్టు ఉంది. ఆ కట్టుతోనే ఆయన పాల్గొని ప్రసంగించారు.
వాస్తవానికి అంతకుముందు, ఆ తర్వాత కూడా తన చేతికి కట్టుతోనే జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు తన పంచాయతీరాజ్, అటవీ శాఖాపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
అయితే, ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీడ్ యాక్సెస్‌రోడ్ ఫేజ్–2, స్టీల్ బ్రిడ్జిలపై రాకపోకల ప్రారంభ కార్యక్రమానికి పవన్ రాకపోవడాన్ని విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
పురపాలకశాఖ మంత్రి నారాయణ స్వయంగా పవన్‌ను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
పవన్ అదే రోజు అంటే ఆగస్టు 13న విశాఖలో జరిగిన జాతీయ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర అటవీ పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు.
పవన్ తనకు ముందుగానే ఈ విషయం చెప్పారని నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

ఫొటో సోర్స్, Janasena
ఎట్‌హోం కార్యక్రమానికీ దూరం
పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఆగస్టు 15న కాకినాడలో పవన్ కల్యాణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఆ రోజు సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఆతిథ్యమిచ్చిన ఎట్ హోం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రాలేదు.
అప్పటికే పవన్ భుజం నొప్పితో బాధ పడుతున్నారని, స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనాలని వచ్చారే తప్పించి చాలా నీరసంగా ఉన్నారని ఆ రోజు ఆయన వెంట ఉన్న జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బీబీసీతో అన్నారు.
''జెండా కార్యక్రమం అయిపోగానే వెంటనే పవన్ హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. నేను కాకినాడలో ఆయన వెంటే ఉన్నాను. చాలా నీరసంగా ఉన్నారు. అందుకే ఆ రోజు సాయంత్రం అమరావతిలో కార్యక్రమానికి వెళ్లి ఉండరు'' అని దొరబాబు పేర్కొన్నారు.
అనారోగ్యం వల్లే: టీడీపీ, జనసేన
కేబినెట్ సమావేశాలకు, పలు కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానాన్ని కొంతమంది సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
అయితే జనసేన, టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. కేబినెట్ భేటీ అంటే దాదాపు మూడు గంటలపైనే ఉంటుందని, ప్రస్తుతం ఆయన అనారోగ్యం దృష్ట్యా కొంతకాలం అలా సుదీర్ఘ సమయం జరిగే సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టంగా చెప్పినందువల్లే పవన్ కల్యాణ్ కేబినెట్, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లుగా తాము భావిస్తున్నామని జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
'సమస్య అనారోగ్యమే, అంతకుమించి ఏమీ లేదు'
‘‘చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకే స్టాండ్ తీసుకుని పరిపాలన సాగిస్తున్నారు. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న చర్చ అవసరం లేదు'' అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బీబీసీతో అన్నారు.
'అది వ్యూహంలో భాగం'- రమణమూర్తి
పవన్ కల్యాణ్ తన రాజకీయ వ్యూహంలో భాగంగానే కేబినెట్ భేటీలకు గైర్హాజరు అవుతున్నారని తాను భావిస్తున్నట్లు బీబీసీతో సీనియర్ జర్నలిస్ట్ రమణమూర్తి అన్నారు.
''నిశితంగా గమనిస్తే కీలక అంశాల చర్చ జరుగుతున్నప్పుడే ఆయన రావడం లేదని తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయాల్లో ఇష్టం లేని అంశాలు ఉంటే వాటిని మినిట్స్ రాసేటప్పుడు అక్కడ కామెంట్స్ రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మరింత సంచలనం అవుతుందని, ఇలా మంత్రివర్గ సమావేశాలకు పవన్ గైర్హాజరవుతున్నారనే భావించాలి. అయితే ఇరు పార్టీలూ ఈ వాదనను ఇప్పుడు బహిరంగంగా అంగీకరించకపోవచ్చు. కానీ వాస్తవం అదే'' అని రమణమూర్తి అభిప్రాయపడ్డారు.
అయితే, కేబినెట్ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదన్న విషయంపై పవన్ కల్యాణ్‌తో మాట్లాడే ప్రయత్నం బీబీసీ చేస్తోంది. ఆయన స్పందిస్తే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































