చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా వైమానిక దాడుల్లో చాబహార్ పోర్టులోని మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ దెబ్బతిన్నట్టు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.

బీబీసీ పర్షియన్ ప్రతినిధి ఘోంచే హబీబిజాదే చాబహార్ దాడికి సంబంధించిన వీడియోను 'ఎక్స్‌'లో షేర్ చేశారు.

జూలై 8, 9 తేదీల రాత్రి సముద్ర ట్రాఫిక్ నియంత్రణ టవర్‌పై దాడి జరిగిందని చాబహార్ ఫ్రీ జోన్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ సయీద్ అర్బాబీ చెప్పినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

దాడిలో టవర్ దెబ్బతిందని, చాబహార్ ఫ్రీ జోన్‌లోని ఒక గిడ్డంగి కూడా దెబ్బతిన్నట్టు ఆయన తెలిపినట్లు చెప్పింది.

ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన అమెరికా దాడుల్లో తమ పౌరులు 14 మంది మరణించారని ఇరాన్ పేర్కొంది. ప్రతీకార చర్యగా కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా తెలిపింది. ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల ప్రకారం తొమ్మిదో తేదీన (గురువారం) కువైట్, జోర్డాన్, ఇరాక్‌లలో ఇరాన్ మరిన్ని దాడులు చేసింది.

చాబహార్ విషయంలో భారత్ వైఖరి మారుతోందా?

చాబహార్‌ను భారత్‌కు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. భారత్ 2017-18లో చాబహార్ పోర్టులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో భారత్ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులను కేటాయించలేదు .

గత ఏడాది బడ్జెట్‌లో చాబహార్ పోర్టు కోసం భారత్ 400 కోట్లు కేటాయించింది.

ఇరాన్‌తో చేపట్టే ఈ ఉమ్మడి ప్రాజెక్టు కోసం భారత్ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం ఇదే మొదటిసారి.

చాబహార్ పోర్టు నుంచి భారత్ వైదొలగడానికి ప్రధాన కారణం అమెరికా నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ బలహీనపడడం చాబహార్ పోర్టులో భారత్ తన పెట్టుబడులను కొనసాగించకపోవడానికి ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ అస్థిరత, మారుతున్న భౌగోళిక రాజకీయాల కారణంగా గతంలో చాబహార్ పనులు నెమ్మదించాయి.

ఈ ఏడాది చాబహార్‌కు భారత్ నిధులు కేటాయించకపోవడంతో అది నిలిచిపోవచ్చనే భయం ఇప్పుడు నెలకొంది.

(ఈ ఏడాది ఫిబ్రవరిలో బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా రాసిన కథనం ఆధారంగా..)

చాబహార్‌లో రెండు ఓడరేవులు ఉన్నాయి - షాహిద్ కలంతరి, షాహిద్ బహిశ్తి.

ఇది హార్ముజ్ జలసంధికి వెలుపల, పాకిస్తాన్ గ్వాదర్ ఓడరేవుకు కేవలం 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున పెద్ద ఓడలకు అనుకూలమైనది.

ఈ ఓడరేవు ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఈ సముద్ర ప్రాంతాన్ని భారత్ చాలాకాలంగా ఒక వ్యూహాత్మక ప్రత్యామ్నాయ మార్గంగా పరిగణిస్తోంది.

అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌కు చాబహార్ పోర్టు చాలా ముఖ్యమైనది.

ఈ మార్గం భారత్‌కు యూరప్ ప్రవేశాన్ని సులభతరం చేయడంతో పాటు ఇరాన్, రష్యాలకు కూడా ప్రయోజనం కలిగిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 మే నెలలో ఇరాన్‌లో పర్యటించారు. గత 15 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇరాన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

ఈ పర్యటన సందర్భంగా భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య త్రైపాక్షిక సంబంధమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టును అభివృద్ధి చేసి, నిర్వహించేందుకు 550 మిలియన్ డాలర్ల పెట్టుబడిని మోదీ ప్రకటించారు.

అప్పటి నుంచి భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి చాబహార్‌లో భారత్ వాటా, ఆసక్తి మారుతూ వస్తోంది.

ఈ పోర్టు భారత్‌కు మరింత ముఖ్యమైనది. ఎందుకంటే, ఇది పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా మార్కెట్లలోకి భారత్‌కు ప్రవేశాన్ని కల్పిస్తుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యం

2024 మే 13న చాబహార్ పోర్టులోని షాహిద్ బహిశ్తి టెర్మినల్‌ను పదేళ్లపాటు నిర్వహించడానికి భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

అఫ్గానిస్తాన్‌తో వాణిజ్యం, మానవతా సాయం, ప్రాంతీయ అనుసంధానాన్ని కొనసాగించడానికి భారత పోర్టులోని షాహిద్ బహిశ్తి టెర్మినల్ నిర్వహణలో వాటాను కొనుగోలు చేసింది.

ఈ ఒప్పందాన్ని ఏటా పునరుద్ధరించాల్సిఉంటుంది. 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం చాబహార్ పోర్టులోని షాహిద్ బహిశ్తి టెర్మినల్‌ నిర్వహణ భారత్ కొనసాగించింది.

2018లో చాబహార్ ప్రాజెక్టుకు ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపు ఇచ్చింది. కానీ, ట్రంప్ ఆ ఆంక్షలను తిరిగి విధించారు.

దిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో కొత్త వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరినప్పుడు ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తడం మొదలైంది.

భారత్-యూరప్-మధ్యప్రాచ్య కారిడార్‌ను నిర్మిస్తే, చాబహార్ ఓడరేవు తన ప్రాముఖ్యాన్ని కోల్పోతుందని భావించారు. దీనిని ఇరాన్‌ను అవమానించినట్టుగా కూడా భావించారు.

2024లో భారత్, ఇరాన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక చాబహార్ ఒప్పందంతో దాని ప్రాముఖ్యత తగ్గలేదని భావించారు. ఇప్పుడు ఆ ఓడరేవు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

కొన్నేళ్లగా భారత్ ఈ ఓడరేవు ద్వారా అఫ్గానిస్తాన్‌కు వేలాది టన్నుల గోధుమలను రవాణా చేసింది. అయితే ఈ కీలకమైన ఓడరేవు నిర్వహణాపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంది.

భారత్‌పై అమెరికా ఒత్తిడి ఉందా?

గత ఏడాది సెప్టెంబరులో చాబహార్ ఓడరేవు నిర్వహణలో భాగమైనవాటిపై అమెరికా ఆంక్షలు ప్రకటించింది.

అయితే అమెరికా ఈ ఆంక్షల నుంచి భారత్‌కు ఆరు నెలల మినహాయింపు ఇచ్చింది.

కేంద్ర బడ్జెట్‌లో చాబహార్‌కు భారత్ నిధులు కేటాయించకపోవడానికి అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన కారణం అమెరికా ఆంక్షలేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

"చాబహార్ పోర్టుకు సంబంధించి అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీని గడువు రాబోయే కొద్ది నెలల్లో ముగుస్తుంది. అమెరికా ఆంక్షలే భారత్‌కు అతిపెద్ద ఆందోళన అందుకే ఈ బడ్జెట్‌లో చాబహార్‌కు భారత్ నిధులు కేటాయించలేదు" అని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణలు, పరిశోధకులైన డాక్టర్ ముదస్సిర్ ఖమర్ 2026-27 బడ్జెట్ సమయంలో వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ ఫజ్జుర్ రెహమాన్ ఖాన్ కూడా చాబహార్ నుంచి భారత్ వైదొలగడానికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు.

"భారత్‌కు ఇచ్చిన మినహాయింపును అమెరికా ఉపసంహరించుకుంది. భారత్ కూడా అమెరికాతో తన సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల అమెరికాకు కోపం తెప్పించే ఎలాంటి సూచనను ఇవ్వడానికి భారత్ ఇష్టపడడం లేదు" అని ప్రొఫెసర్ ఫజ్జుర్ రెహమాన్ విశ్లేషించారు.

భారత్-అమెరికా సంబంధాల్లో ఒత్తిడి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ భారత్ ఇప్పటికీ అమెరికాతో తన సంబంధాలకే ప్రాధాన్యం ఇస్తుందని ప్రొఫెసర్ ఫజ్జుర్ రెహమాన్ అన్నారు.

"భారత్‌కు అమెరికా అవసరం ఉంది. అలాగే ప్రపంచంలోని ఒక అగ్రరాజ్యానికి కోపం తెప్పించే ప్రమాదాన్ని కూడా భారత్ నివారిస్తోంది" అని ప్రొఫెసర్ ఫజ్జుర్ రెహమాన్ చెప్పారు.

అయితే, ఒకవేళ అమెరికా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉండి ఉంటే చాబహార్‌లో తన పెట్టుబడులను భారత్ కచ్చితంగా కొనసాగించి ఉండేదని ముదస్సిర్ ఖమర్ అంటున్నారు.

భారత్ వెనకడుగు వేస్తోందా?

ఇటీవల భారత్ వ్యూహాత్మకంగా చాబహార్ పోర్టు నుంచి వైదొలుగుతోందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

అయితే, చాబహార్ ఆపరేషన్‌పై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఆపరేషన్‌ను కొనసాగించేందుకు అమెరికాతో పాటు ఇరాన్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్ ఇటీవల ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

"అందరికీ తెలిసినట్టుగా అక్టోబర్ 28, 2025న ఏప్రిల్ 26, 2026 వరకు చెల్లుబాటు అయ్యే షరతులతో కూడిన ఆంక్షల మినహాయింపు కోసం మార్గదర్శకాలను అందిస్తూ అమెరికా ట్రెజరీ విభాగం ఒక లేఖను జారీ చేసింది. ఈ ఏర్పాటును ఖరారు చేయడానికి మేం అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇరాన్‌తో మాకు చాలా కాలంగా సంబంధాలున్నాయి. మేం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కొనసాగిస్తాం" అని భారత్ ఆ ప్రకటనలో పేర్కొంది.

అయితే, డాక్టర్ ముదస్సిర్ ఖమర్ మాత్రం ఈ పోర్ట్ నుంచి భారత్ వైదొలగుతుందని చెప్పలేమన్నారు. "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ఇరాన్‌లో కొనసాగుతున్న అస్థిరత కూడా ప్రధాన కారణాలే. అయినప్పటికీ, చాబహార్ నుంచి భారత్ పూర్తిగా వైదొలుగుతోందని చెప్పలేం" అని అభిప్రాయపడ్డారు.

"భారత్ ఇప్పుడు వెనక్కి తగ్గుతోందని చెప్పడం సరైనది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాబహార్ పోర్టులో పెట్టుబడుల కోసం 2016లో కుదిరిన 10 ఏళ్ల భారత్-ఇరాన్ ఒప్పందాన్ని భారత్ దాదాపు పూర్తి చేసింది. అంతేకాకుండా 2024 వరకు చాబహార్‌ను నిర్వహించడానికి భారత్ 10 ఏళ్ల ఒప్పందంపై కూడా సంతకం చేసింది. భారత్ చాబహార్ నుండి పూర్తిగా వైదొలగదు" అని ప్రొఫెసర్ ముదస్సిర్ ఖమర్ అన్నారు,

చాబహార్ నుంచి పూర్తిగా వైదొలగడానికి బదులుగా భారత్ ఈ విషయంపై అమెరికాతో చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొంటుందని డాక్టర్ ఖమర్ భావిస్తున్నారు.

"భారత్‌కు ముఖ్యంగా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాతో అనుసంధానం దృష్ట్యా చాబహార్ చాలా ముఖ్యం. అందువల్ల భారత్ ఈ ముఖ్యమైన ఓడరేవు నుంచి అంత సులభంగా వైదొలగదు. భారత్‌కు ఇక్కడ భారీ పెట్టుబడులు ఉన్నాయి" అని ఆయన విశ్లేషించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)