భారత నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ షిప్... ఆర్టికల్ 10ని గుర్తు చేస్తూ ఇండియా ఏమని హెచ్చరించిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
సముద్రంలో భారత, పాకిస్తాన్ నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి.
ఈ ఘటన అనంతరం పాకిస్తానీ దౌత్య ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేసింది.
భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటనలో.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఏ రకమైన నౌకలు ఢీకొన్నాయో స్పష్టంగా పేర్కొనలేదు.
అయితే, ఇది అంతర్జాతీయ జలాల్లో జరిగిందని మాత్రం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
అలాగే, 1991లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందంలోని ఆర్టికల్ 10ను ఇది నేరుగా ఉల్లంఘించడమేనని విదేశాంగ శాఖ పేర్కొంది.

విదేశాంగ శాఖ ఏం చెప్పింది?
న్యూదిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన చార్జ్ డీ అఫైర్స్‌ను విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించినట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
''సముద్రంలో పాకిస్తానీ నౌకాదళ యూనిట్లు ఆమోదయోగ్యంకాని, వృత్తివిరుద్ధమైన ప్రవర్తనకు పాల్పడి భారత నౌకాదళ యూనిట్‌తో ఢీకొన్నాయి. ఈ ఘటనపై వారితో (పాకిస్తానీ దౌత్య ప్రతినిధితో) తీవ్ర నిరసన వ్యక్తం చేశాం'' అని తెలిపింది.
''అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ సంఘటన వల్ల ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. 1991 ఏప్రిల్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికలపై ముందస్తు నోటీసుకు సంబంధించిన ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాకిస్తాన్ నౌకాదళ ప్రవర్తన నేరుగా ఉల్లంఘించింది'' అని తన ప్రకటనలో పేర్కొంది.
''ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిరోధించేందుకు అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇరుపక్షాల మధ్యనున్న సంబంధిత ఒప్పందాల్లోని ప్రొవిజన్లను గౌరవించుకోవాలని సంబంధిత పాకిస్తానీ అధికారులకు తెలియజేయాలని పాకిస్తాన్ చార్జ్ డీ అఫైర్స్‌కు సూచించాం'' అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ వద్ద కూడా ఈ ఘటనను లేవనెత్తాలని ఇస్లామాబాద్‌లోని భారత చార్జ్ డీ అఫైర్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంఘటన ఎక్కడ, ఎలా జరిగింది?
మంగళవారం సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌక వైపు పాకిస్తాన్ నౌకాదళ నౌక వేగంగా దూసుకురావడంతో, రెండూ ఢీకొన్నాయని రాయిటర్స్ , ఏఎన్ఐ, ఐఏఎన్ఎస్ వంటి వార్తా సంస్థలు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాశాయి.
గత సంవత్సరం పహల్గాం దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన సైనిక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి ఉద్రిక్తత సంఘటన ఇది.
ఈ ఘటనలో పెద్దగా ఎటువంటి నష్టం వాటిల్లలేదని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. కానీ, రెండు దేశాల మధ్యనున్న 1991 ఒప్పందాన్ని ఈ ఘటన నేరుగా ఉల్లంఘించిందని తెలిపింది.
''సముద్రంలో పాకిస్తాన్ నేవీ షిప్స్ ఈ ఘటనలకు పాల్పడినట్లు ఇండియన్ నేవీ నివేదించింది. దీనిలో, ఈ నౌకల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని, వృత్తివిరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో న్యూదిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన చార్జ్ డీ అఫైర్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసి, నిరసన తెలిపింది'' అని వార్తా సంస్థ ఏఎన్ఐకు మాజీ భారత నౌకాదళ అధికార ప్రతినిధి డీకే శర్మ చెప్పారు.
''నిన్న (మంగళవారం) సాయంత్రం, వారి నౌకలలో కొన్ని వచ్చి భారత నేవీ షిప్ చుట్టూ చాలా ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడ్డాయి. ఇది సముద్రంలో పనిచేసే ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. సముద్రంలో రెండు నౌకల మధ్య దూరం పాటించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. అవి యుద్ధ నౌకలైనా, వాణిజ్య నౌకలైనా సరే'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఒప్పందం ఏంటి?
సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికలకు సంబంధించిన ముందస్తు నోటీసు నియమాలపై 1991 ఏప్రిల్‌లో భారత్, పాకిస్తాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
రెండు దేశాల మధ్య జరిగే ఏవైనా సైనిక విన్యాసాలు లేదా సైనికుల కదలికల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తకుండా నిరోధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఒప్పందం కింద.. ఇరు దేశాలు భూ, వాయు, నౌకా దళాలు ఒకదానికొకటి సమీపంగా సైనిక విన్యాసాలు చేపట్టకూడదు.
భిన్నమైన 15 ఆర్టికల్స్ ఉన్న ఈ ఒప్పందంలో ఆర్టికల్ 10 ఉల్లంఘనే ఈ సంఘటన అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఆర్టికల్ 10 ప్రకారం, అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇరు దేశాల నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు ఒకదానికొకటి కనీసం మూడు నాటికల్ మైళ్ల దూరం పాటించడం అవసరం.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనపై పాకిస్తాన్ ఇంకెలాంటి ప్రకటన జారీ చేయలేదు.
రెండుదేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా పరిమిత స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఏ దేశానికి కూడా హై కమిషనర్ లేరు. రెండు దేశాల హై కమిషన్లలో చార్జ్ డి అఫైర్స్నే నియమించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























