న్యూజీలాండ్‌తో రెండో టెస్టులోనూ సిరాజ్‌కు దక్కని చోటు.. జట్టు కూర్పుపై సునీల్ గావస్కర్, మహమ్మద్ కైఫ్ విమర్శలు

క్రికెట్, న్యూజీలాండ్, సిరాజ్, భారత్, ఫాస్ట్ బౌలర్లు
ఫొటో క్యాప్షన్, గత ఏడాది ఇంగ్లండ్‌తోె జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ బాగా రాణించాడు.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

రెండో టెస్టులోనైనా సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరిగింది. అయినప్పటికీ న్యూజీలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత తుది జట్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు.

తొలి టెస్టులో భారత బౌలర్లు న్యూజీలాండ్ జట్టును ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. ఆ సమయంలోనే సిరాజ్‌ను వరుసగా రెండో టెస్టులోనూ పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఆతిథ్య జట్టు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరాజ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గత ఏడాది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు ఆరు పరుగుల తేడాతో అసాధారణ విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ తర్వాత ఏడు టెస్టుల్లో 21 వికెట్లు తీశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తొలి టెస్టులో సిరాజ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.

రెండో టెస్టు కోసం భారత జట్టులో కేవలం ఒక్క మార్పు మాత్రమే చేశారు. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో గుర్నూర్ బరార్‌కు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు.

ఈ టెస్టులో ఎవరైనా ఒక బౌలర్‌ను తప్పిస్తే సిరాజ్‌కు జట్టులో చోటు దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు.

క్రికెట్, న్యూజీలాండ్, సిరాజ్, భారత్, ఫాస్ట్ బౌలర్లు
ఫొటో క్యాప్షన్, రెండో టెస్ట్ కోసం భారత జట్టులో ఒకే ఒక మార్పు చేశారు.

‘ఇది నమ్మశక్యం కాని నిర్ణయం’

భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మహమ్మద్ సిరాజ్‌ను మళ్లీ జట్టు నుంచి తప్పించారంటే నమ్మడం కష్టంగా ఉందని మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న మహమ్మద్ కైఫ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

"విదేశాల్లో ఆడే టెస్ట్ మ్యాచ్‌లలో భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు సిరాజ్ పేరును కూడా మొదటగా పరిగణనలోకి తీసుకోవాలి. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్వయంగా సిరాజ్‌ను ప్రపంచ స్థాయి బౌలర్‌గా అభివర్ణించి, అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు" అని కైఫ్ రాశారు.

సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే కూడా నిరాశ వ్యక్తం చేశారు.

సిరాజ్ ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలర్లలో ఆరో స్థానంలో ఉన్నాడని అలాంటి ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయంగా తనకు అనిపించడం లేదని హర్షాభోగ్లే అన్నారు.

"ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సీజన్‌లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఐదుగురు బౌలర్లలో ఇప్పుడు బుమ్రాకు మాత్రమే భారత్ జట్టులో చోటు కల్పించింది. బౌలింగ్ చేయడానికి అతనికి అద్భుతమైన పరిస్థితులు లభిస్తాయని ఆశిస్తున్నాను. కానీ తన వంతు వచ్చినప్పుడు తనను తాను నిరూపించుకోవాలి, లేదంటే చాలా కాలం పాటు మళ్లీ అవకాశం రాదని కూడా అతనికి తెలుసు."

క్రికెట్, న్యూజీలాండ్, సిరాజ్, భారత్, ఫాస్ట్ బౌలర్లు
ఫొటో క్యాప్షన్, ప్రసిద్ద కృష్ణ స్థానంలో రెండో టెస్ట్‌లో గుర్నూర్ బరార్‌‌కు చోటు కల్పించారు.

‘సిరాజ్‌ను, జడేజాను ఎందుకు ఆడించడం లేదు?’

తొలి టెస్టులో సిరాజ్‌కు జట్టులో చోటు దక్కనప్పుడు కూడా హర్షా భోగ్లే స్పందించారు.

"భారత్ జట్టు నుంచి సిరాజ్‌ను తొలగించడం ఆశ్చర్యంగా, నిరాశగా ఉంది. జట్టు కోసం అప్పగించిన ప్రతి బాధ్యతను అతను చాలా బాగా నిర్వర్తించాడు. బుమ్రా అందుబాటులో లేని సమయంలో బౌలింగ్ విభాగాన్ని సమర్థంగా నడిపించాడు. సానుకూల దృక్పథం ఉన్న టీమ్ ప్లేయర్. జట్టు యాజమాన్యం సిరాజ్‌తో నిజాయితీగా మాట్లాడుతుందని ఆశిస్తున్నా'' అని హర్షాభోగ్లే 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

తొలి టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గావస్కర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"టెస్ట్ జట్టులో సిరాజ్ ముందుగా చేరనప్పుడే ఆ సంకేతాలు కనిపించాయి. అతను చివరి వన్డే ఆడినప్పుడు, టెస్టుల్లో కూడా ఆడిస్తారని నేననుకున్నాను. కానీ ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. అతను భారత్‌ను ఎప్పుడూ నిరాశపర్చలేదు'' అని సోనీ స్పోర్ట్స్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు.

జట్టు ఎంపికపై గావస్కర్ ఇప్పుడు మరోసారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సిరాజ్‌తో పాటు రవీంద్ర జడేజాను ఆడించకపోవడంపై ఆయన ప్రశ్నలు వేశారు.

క్రికెట్, న్యూజీలాండ్, సిరాజ్, భారత్, ఫాస్ట్ బౌలర్లు
ఫొటో క్యాప్షన్, రెండో జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గావస్కర్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

‘మ్యాచ్‌ను గెలిపించగల బౌలర్లు ఎవరు?’

సిరాజ్, జడేజా ఇద్దరినీ పక్కన పెట్టడం కఠినమైన నిర్ణయమని గావస్కర్ అన్నారు. ముఖ్యంగా మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనా ఉన్నప్పుడు జడేజాను పక్కన పెట్టడం ఒక పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు.

"మీరు సిరాజ్ గురించి మాట్లాడుతున్నారు. మరి జడేజా సంగతేంటి? అతను 33 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అతను బంతిని బాగా టర్న్ చేస్తాడు కాబట్టి మ్యాచ్ నాలుగోరోజు, ఐదోరోజు అతని స్పిన్ బౌలింగ్ చాలా ఉపయోగపడి ఉండేది. అతను బంతిని మరీ ఎత్తుగా వేసే బౌలర్ కాదు. కానీ బంతి పిచ్‌పై పట్టు సాధించేలా చేసి స్పిన్ చేయించడంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేని సమయంలో కూడా జడేజా అలా బౌలింగ్ చేయగలడు" అని రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు సోనీ స్పోర్ట్స్‌తో గావస్కర్ అన్నారు.

సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడంపై టీవీ యాంకర్ సుమంత్ రామన్ కూడా 'ఎక్స్‌'లో విమర్శలు చేశారు.

"ఇది మహమ్మద్ సిరాజ్‌కు అన్యాయం. తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు రెండు రోజుల పాటు న్యూజీలాండ్‌ను ఆలౌట్ చేయలేకపోయిన అదే ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి మళ్లీ ఎంపిక చేశారు. కేవలం ఒక్క మార్పు మాత్రమే చేశారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం" అని ఆయన పోస్ట్ చేశారు.

భారత మాజీ బౌలర్ మునాఫ్ పటేల్ కూడా 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేశాడు.

''మీరు సిరాజ్, షమీ, జడేజాలను పరిగణనలోకి తీసుకోకపోతే మరి జట్టులో మ్యాచ్‌ను గెలిపించగల బౌలర్లు ఎవరున్నారు?'' అని మునాఫ్ పటేల్ ప్రశ్నించాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)