కొలంబియాలో భూకంపం.. 132 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జోస్ కార్లోస్ క్యుటో, వెనెస్సా బుష్ షూట్లర్, మైకేల్ షీల్స్ మెక్ నామీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
కొలంబియాను భారీ భూకంపం కుదిపేసింది. ఇప్పటివరకు కనీసం 132 మంది మరణించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
కూలిపోయిన భవనాల శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరికే అవకాశం ఉంది.
చోకో ప్రావిన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.34 సమయంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 103 కిలోమీటర్ల లోతులో ఉందని కొలంబియా జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప తీవ్రత పశ్చిమ కొలంబియాలోని చాలా ప్రాంతాల్లో కనిపించింది.
కొలంబియాలోని కాఫీ పండించే ప్రాంతంలోని పెరీరా నగరంలోనే ఎక్కువ మంది మరణించారు. చుట్టుపక్కల నగరాలతో పాటు వల్లె డెల్ కౌకా ప్రాంతం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
భూకంప కేంద్రం చోకో ప్రావిన్స్‌లోని సాన్ జోస్ డెల్ పాల్మార్ గ్రామానికి సమీపంలో ఉంది.


ఫొటో సోర్స్, EPA
భూకంప కేంద్రం ఉన్న ప్రాంతంలో రహదారులు దెబ్బతిన్నాయని, అయితే అక్కడ ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని స్థానిక మేయర్ లియోన్ ఫాబియో మారిన్ మోంకాడా చెప్పారు.
భూకంప కేంద్రానికి సుమారు 55కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరీరా నగరం తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా కనిపించింది.
బీబీసీ ధ్రువీకరించుకున్న వీడియోల్లో.. నగరంలోని ప్రధాన కూడలి ప్లాజా బొలివార్లో ఒక భవనం కూలిపోతున్నట్లు కనిపించింది.
అక్కడంతా శిథిలాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉన్నారు.
నగర మెట్రోపాలిటన్ ప్రాంతంలో 40 మంది మరణించారని, 65 భవనాలు కూలిపోయాయని స్థానిక అధికారులు తెలిపారు. కూలిపోయిన 15 భవనాల్లో శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉన్నట్లు భావిస్తున్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది.

ఫొటో సోర్స్, EPA
భూకంప కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలీలో 32 భవనాలు కూలిపోయాయి.
లండన్‌కు చెందిన 29 ఏళ్ల డాన్ కట్లర్ తన భాగస్వామితో కలిసి రెండు నెలలుగా కొలంబియాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాలీలో ఉన్నారు.
"నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" అని ఆయన బీబీసీతో చెప్పారు.
"మేం పైజామాలతోనే బయటకు పరుగెత్తాం. హోటల్‌కు పెద్దగా నష్టం జరగలేదు. కానీ గోడల్లో పగుళ్లు ఉన్నాయి. పెయింట్, ప్లాస్టర్ ఊడిపోయాయి" అని ఆయన చెప్పారు.
మనిజాలెస్, క్విబ్డో, మెడెలిన్, అలాగే చోకో వల్లే డెల్ కౌకా ప్రాంతాల్లోనూ కొందరు మరణించినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
మనిజాలెస్‌లో ఇద్దరు మరణించారు.
తాము మనిజాలెస్లోని హోటల్లో ఉంటున్నట్లు అంజెలికా అవిలా బీబీసీతో చెప్పారు.
భూకంపం వచ్చినప్పుడు గోడల్లో పగుళ్లు కనిపించాయని ఆమె అన్నారు.
"అందరూ అరుస్తున్నారు. పక్కనే ఉన్న భవనాల నుంచి దుమ్ము వచ్చింది. గోడలు పగిలి ఇటుకలు ఊడిపడటం చూశాను" అని ఆమె చెప్పారు.
భూకంపం సంభవించినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని మనిజాలెస్కు చెందిన జర్నలిస్టు, వాతావరణ శాస్త్రవేత్త లూయిస్ ఫెలిపే మోలినా చెప్పారు. భూకంప కేంద్రానికి మనిజాలెస్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గతంలో సంభవించిన భూకంపాల కారణంగా నగరంలో భవన నిర్మాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని, అందువల్ల తన ఇల్లు ఈ భూకంప ప్రభావాన్ని తట్టుకుందని ఆయన వివరించారు.
"నా దగ్గర 450 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అల్మారాల్లో నిలిచి ఉన్నాయి. అద్దాలు పగిలే శబ్దం, ప్రజలు అరుస్తున్న శబ్దం వినిపించాయి" అని ఆయన బీబీసీతో చెప్పారు.
"అది చాలా భయంకరమైన అనుభవం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో బ్యూనావెంచురాతో సహా పలు ప్రాంతీయ విమానాశ్రయాల్లో నష్టం సంభవించినట్లు కొలంబియా ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
బొగోటాలో చెట్లు ట్రాఫిక్ లైట్లు తీవ్రంగా ఊగిపోయాయి.
భవనాల్లో పగుళ్లు ఏర్పడినట్లు రిపోర్ట్స్ వచ్చాయి.
పొరుగున ఉన్న వెనిజులా, ఈక్వడార్, పనామాలోనూ భూకంప తీవ్రత కనిపించింది.
వెనెజ్వెలాఉత్తర ప్రాంతంలో జంట భూకంపాలు 6,300 మందికి పైగా ప్రాణాలు తీసిన ఘటనకు రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భూకంపం సంభవించింది.
కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా జాతీయ విపత్తు పరిస్థితిని ప్రకటించారు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక అధికారాలను కల్పించారు. ఇందులో బడ్జెట్లను సమీక్షించే అధికారం కూడా ఉంది.
శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త అధ్యక్షుడికి తాజా భూకంపం పెద్ద సవాలు కానుంది.
132 మంది మరణించారని.. 1,500కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధ్యక్షుడు ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టం వివరాలు తెలుస్తుండడంతో ప్రపంచ నాయకులు మద్దతు అందించేందుకు ముందుకు వచ్చారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కొలంబియాకు అండగా నిలుస్తామని తెలిపారు.
కాగా ఈయూ అధిపతి ఉర్సులా వాండర్లయిన్ తమ కోపర్నికస్ ఉపగ్రహాన్ని సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె కొలంబియా ప్రజలకు సంఘీభావ సందేశాన్ని పంపి సహాయక చర్యల కోసం సిబ్బంది, పరికరాలను అందిస్తామని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























