నటుడు రాజేష్ శర్మ అనారోగ్యం పాలవడంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలనే డిమాండ్ ఎందుకు?

రాజేశ్ శర్మ, ఫౌజీ, రామోజీ ఫిల్మ్ సిటీి, ప్రభాస్ సినిమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజేశ్ శర్మను రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ పురుగు కుట్టినట్లు కథనాలు వచ్చాయి.
    • రచయిత, రూప్సా సేన్ గుప్తా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్‌ సమయంలో ఓ పురుగు కుట్టడంతో ప్రసిద్ధ బెంగాలీ నటుడు రాజేష్ శర్మ అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని కోల్‌కతాలోని ధాకురియాలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏదో పురుగు కుట్టడంతో ఆయన కోల్‌కతా తిరిగి వెళ్లారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

రాజేశ్ శర్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి, మంత్రి డాక్టర్ ఇంద్రనీల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శర్మ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని ధాకురియాలోని మణిపాల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సర్వీసెస్ ఆఫీసర్ డాక్టర్ తానియా లోధ్ బీబీసీతో చెప్పారు.

"మేము ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. తన వైద్య చికిత్స గురించి బయటకు వెల్లడించేందుకు ఆయన అంగీకరించలేదు కాబట్టి నేను ఇంత కంటే ఎక్కువ ఏమీ చెప్పలేను" అని ఆమె అన్నారు.

మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.

రాజేశ్ శర్మ, ఫౌజీ, రామోజీ ఫిల్మ్ సిటీి, ప్రభాస్ సినిమా

ఫొటో సోర్స్, @IndranilKhan

ఫొటో క్యాప్షన్, తాను రాజేశ్ శర్మను పరామర్శించిన ఫోటోను ఇంద్రనీల్ ఖాన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

"ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు బాగా జ్వరం, కుడికాలిలో ఇన్ఫెక్షన్ ఉన్నాయి. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉందని ఆయన చెప్పారు. ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో జ్వరం కూడా పెరిగింది. ఆయన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలన నిర్ణయించాం. ఇప్పుడాయన ఆరోగ్యం నిలకడగా ఉంది" అని ఆసుపత్రికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.

రాజేశ్ శర్మ డయాబెటిస్‌తో బాధ పడుతున్నారు. ఇది ఆయన ఆరోగ్య పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందని వైద్యులు చెప్పారు.

రాజేష్ శర్మ కుటుంబం తరపున నటి సుదీపా ఛటర్జీ ఒక ప్రకటన విడుదల చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ కథనం తెలిపింది.

షూటింగ్ పూర్తైన తర్వాత చెట్లు దట్టంగా ఉన్న ప్రాంతంలో రాజేశ్ శర్మ ఇతర సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్నప్పుడు తనను ఏదో కుట్టినట్లు అనిపించిందని చెప్పినట్లు సుదీపా చటర్జీ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

మొదట్లో పెద్దగా నొప్పి లేకపోవడంతో వెంటనే వైద్య సాయం తీసుకోలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే సుమారు 6గంటల తర్వాత కుడికాలిలో నొప్పి తీవ్రం కావడంతో ఆయన పరిస్థితి విషమించింది. కోల్‌కతాకు చేరుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

రాజేష్ శర్మ ప్రస్తుంత హను రాఘవపుడి దర్శకత్వంలోని ఫౌజీ చిత్రంలో నటిస్తున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. షూటింగ్ సమయంలో ఏదైనా సంఘటన జరిగినట్లు కానీ, తనకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కానీ ఆయన తమకు చెప్పలేదని 'ఫౌజీ' నిర్మాతలు చెప్పారు.

రాజేష్ శర్మకు వైద్యపరమైన అత్యవసర పరిస్థితికి దారి తీసిన పరిస్థితులపై 'తక్షణ, నిష్పక్షపాత, పారదర్శక విచారణ' జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత సినీ కార్మికుల సంఘం ఒక ప్రకటన జారీ చేసింది.

రాజేశ్ శర్మ, ఫౌజీ, రామోజీ ఫిల్మ్ సిటీి, ప్రభాస్ సినిమా

ఫొటో సోర్స్, Getty Images

అక్షయ్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్

"రామోజీ ఫిల్మ్ సిటీలోని 'ఫౌజీ' షూటింగ్ సెట్స్‌లో జరిగిన సంఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తోంది" అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.

"నటుడు రాజేశ్ శర్మకు వైద్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తడానికి కారణమేంటి? షూటింగ్ జరిగే ప్రదేశంలో భద్రత, పరిశుభ్రత, అత్యవసర వైద్య సంరక్షణకు సంబంధించి నిబంధనలు పాటించారా? నిర్మాత, నిర్మాణ సంస్థ వైపు నుంచి ఏదైనా నిర్లక్ష్యం ఉందా అనే విషయాలపై దర్యాప్తు చేయాలి" అని ఆయన రాశారు.

"షూటింగ్ సమయంలో నా ప్రియ మిత్రుడు రాజేష్‌ను పురుగు కుట్టిన తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారని తెలిసి ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మహాదేవుడిని కోరుకుంటున్నాను. త్వరగా కోలుకో మిత్రమా. మనం సరదాగా గడపాల్సిన సమయం ఇంకా చాలా ఉంది" అని నటుడు అక్షయ్ కుమార్ ఎక్స్‌లో రాశారు.

శక్తివంతమైన నటనకు పేరుగాంచిన రాజేశ్ శర్మ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకున్నారు.

ఆయన అనేక బెంగాలీ చిత్రాలలో నటించారు. ఖోస్లా కా ఘోస్లా, బజరంగీ భాయిజాన్, పరిణీత వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలోనూ కనిపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)