తిరుప్పరంకుండ్రం: కొండ మీద దీపం వెలిగించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఇంకా ఏం వ్యాఖ్యలు చేసింది?

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై నవంబర్ 28న దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది. తిరుప్పరంకుండ్రం ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేసింది.
కార్తీక దీపం పండుగ రోజైన నవంబర్ 24న తిరుపరన్‌కుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై ఒక్కసారి దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
అయితే, ఆ రోజు కూడా ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే దీపం వెలిగించారు.
ఈ వ్యవహారంలో మదురై జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి.


ఫొటో సోర్స్, ANI
భారత పురావస్తు శాఖ వాదన
తిరుప్పరంకుండ్రంలోని దీపత్తూన్ పరిశీలించకుండా తమిళనాడు పోలీసులు తమ అధికారులను అడ్డుకున్నారని భారత పురావస్తు శాఖ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
నవంబర్ 24న మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు తమ అధికారులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారని పురావస్తు శాఖ వెల్లడించింది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న సీనియర్ పోలీసు అధికారులు వారిని ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదని తెలిపింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపత్తూన్‌ను పరిశీలించకుండా తమ అధికారులను అడ్డుకున్నారని ఆరోపించింది.
తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిపాలనా అధికారాల పరిధిని దాటినట్లుగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని పురావస్తు శాఖ కోరింది.
అలాగే, కోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ వ్యవహారంలో భద్రతా ఏర్పాట్లతో సహా ఏ విషయంలోనూ తమిళనాడు పోలీసులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బయటి బృందాన్ని నియమించాలని కూడా కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రస్టీల బోర్డుపై అసంతృప్తి
లైవ్ లా కథనం ప్రకారం, తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకూడదని ఆలయ ట్రస్టీల బోర్డు నిర్ణయించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
కోర్టు ఆదేశాలను అధికారుల సహకారంతో ట్రస్టీలు తీవ్రంగా ఉల్లంఘించారని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎప్పటిలాగే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ ప్రాంగణంలోని మండపంలోనే దీపం వెలిగించాలని ట్రస్టీల బోర్డు తీసుకున్న నిర్ణయంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకూడదనే ఉద్దేశం ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను, హైకోర్టుకు ఇచ్చిన హామీని తక్కువ చేసి చూపించే ప్రయత్నమే ట్రస్టీల ప్రతిపాదన అని కోర్టు తెలిపింది.
ఆలయ వారసత్వం ఏమిటో కోర్టుకు తామే వివరిస్తామంటూ ట్రస్టీల బోర్డు చేసిన వ్యాఖ్యలపైనా న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయ వారసత్వం గురించి సుప్రీంకోర్టుకు అవగాహన లేదన్నట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శి సహా 13 మందికి నోటీసులు
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హిందూ రిలీజియస్, చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, మదురై పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్, మదురై ఎస్పీ, సుబ్రమణ్య స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి, ట్రస్టీల బోర్డు సభ్యులు, ట్రస్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు జారీ చేసిన తేదీ నుంచి 10 రోజుల్లోగా సంబంధిత వ్యక్తులు అఫిడవిట్లు దాఖలు చేయాలి. తదుపరి విచారణకు వారంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆలయ నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ట్రస్టీల బోర్డును తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కొండపై దీపం వెలిగించాలని ఆదేశం
నవంబర్ 28న తిరుప్పరంకుండ్రంలోని దీపత్తూన్ పై వెలిగించే దీపం నుంచి వచ్చే జ్యోతితో ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనూ దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలో భక్తులు దీపాలు వెలిగించేందుకు అనుమతించింది.
ఈ ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వి. పార్థిబన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఆలయ భద్రత బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.
దీపం వెలిగించే స్థలంపై వివాదం ఏమిటి?
కార్తీక దీపం తమిళనాడులో జరుపుకునే ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి. ఈ సందర్భంగా ఆలయాలు, ఇతర పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తారు.
తిరుప్పరంకుండ్రంలో ఆలయ యాజమాన్యం కొన్ని దశాబ్దాలుగా కొండ దిగువన ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే దీపం వెలిగిస్తోంది.
అయితే, కొండపై ఉన్న రాతి స్తంభంపై కూడా దీపం వెలిగించాలని కొన్ని హిందూ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ స్తంభాన్ని వారు 'దీపత్తూన్' అంటే దీపం వెలిగించే స్తంభంగా పేర్కొంటున్నారు.
ఈ డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వ హిందూ రిలీజియస్, చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వ్యతిరేకించింది.
150 ఏళ్లకు పైగా దీప మండపంలోనే దీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతోందని, రాతి స్తంభంపై దీపం వెలిగించినట్లు ఎలాంటి స్థిరమైన సంప్రదాయం లేదని ఆ శాఖ పేర్కొంది.
1862, 1912లో కొండపై దీపం వెలిగించేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించింది.
రాతి స్తంభంపై దీపం వెలిగిస్తే అక్కడ ఇప్పటికే కొనసాగుతున్న సంప్రదాయానికి ఆటంకం కలగవచ్చని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























