You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పార్లమెంట్ సీట్ల పెంపు: వర్షాకాల సమావేశాలలో బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా.. మారుతున్న సమీకరణలు ఏం చెబుతున్నాయి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి పదవీ కాలంలో జరగనున్న ఈ వర్షాకాల సమావేశాలు పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. ఎందుకంటే, పార్లమెంట్ లోపల రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో 20 మంది ఎంపీలు ఎన్‌డీఏకు తమ మద్దతును ప్రకటించారు.
శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం, అలాగే టీఎంసీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా ఎన్‌డీఏ శిబిరంలోకి రావడంతో రాజ్యసభ ముఖచిత్రం కూడా మారిపోయింది.
వర్షాకాల సమావేశాలకు ముందు, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ప్రభుత్వం ఒక కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని కింద 2029 నాటికి మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని ప్రతిపాదిస్తుంది.
దీంతో పాటు, లోక్‌సభలోని ప్రస్తుత 543 సీట్లను 850కి పెంచేందుకు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ రెండు బిల్లులూ లోక్‌సభలో ఆమోదం పొందలేదు.
కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ తమకు ఉందని ప్రభుత్వానికి పూర్తి నమ్మకం కలిగినప్పుడు మాత్రమే దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
టీఎంసీ రెబెల్ ఎంపీలు 20 మంది, శివసేన (యూబీటీ) ఎంపీలు ఆరుగురు మద్దతు ఇస్తే.. ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చే సభ్యుల సంఖ్య 293 నుంచి 319కి పెరుగుతుంది.
అయినప్పటికీ, సభలో సభ్యులందరూ హాజరై ఓటు వేస్తే... రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ అయిన 360 మంది ఎంపీల బలానికి ఈ సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటుంది.
సుప్రియా సూలే ఎటువైపు?
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై (డీలిమిటేషన్‌పై) రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ఆమోదింపజేసే ప్రయత్నాలు బుధవారం నుంచి ఊపందుకున్నాయి.
అన్ని రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచేందుకు బిల్లులో స్పష్టంగా నిబంధనలు చేర్చినట్లయితే, తమ పార్టీ ఈ ప్రతిపాదిత బిల్లుకు మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) నాయకురాలు సుప్రియా సూలే అనడంతో ఈ ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ఈ చర్చ దృష్టంతా జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనపైనే ఉందని సుప్రియా సూలే తెలిపారు.
"దీనిని అమలు చేయడానికి ఒక స్పష్టమైన ఫార్ములాను లిఖితపూర్వకంగా అందివ్వాలి. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను 50 శాతం పెంచుతామని కేంద్ర హోం మంత్రి చెప్పినప్పటికీ, సభలో ప్రవేశపెట్టిన బిల్లులో దీని ప్రస్తావన లేదు" అని ఆమె అన్నారు.
బిల్లులో వీటిని కనుక చేర్చితే.. దీన్ని వ్యతిరేకించడానికి ఎలాంటి కారణం లేదని సూలే అన్నారు.
అయితే, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో చర్చలు జరిపిన తర్వాతే బిల్లుకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
''50 శాతం పెంపు ప్రొవిజన్‌పై చర్చ జరిగితే.. మేం మద్దతు ఇచ్చేందుకు పరిశీలిస్తాం. ఈ బిల్లును ఎలా అమల్లోకి తెస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు'' అని అన్నారు.
మహారాష్ట్రను ఉదాహరణగా పేర్కొన్న సుప్రియా సూలే.. ప్రతిపాదిత ఫార్ములా ప్రకారం ఆ రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 48 నుంచి 72కు పెరుగుతాయని చెప్పారు.
''ఈ 72 సీట్లలో.. మూడు సీట్లు షెడ్యూల్డ్ కాస్టులు, షెడ్యూల్డ్ ట్రైబ్‌లకు (ఎస్‌సీ, ఎస్టీలకు) రిజర్వు అయి ఉంటాయి. దీని తర్వాత, మిగిలిన 69 సీట్లలో కొన్ని మహిళలకు రిజర్వ్ చేస్తారు. జనరల్ కేటగిరీకి కేవలం 48 సీట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. దీని కోసం ఏ ఫార్ములాను అనుసరిస్తారనేదే ప్రశ్న?" అని సుప్రియా సూలే అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 15న, ఒక సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి 'ది హిందూ'తో మాట్లాడుతూ... "నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, అన్ని రాష్ట్రాల లోక్‌సభ సీట్ల సంఖ్య 50 శాతం పెరుగుతుంది. పార్లమెంటులో ఏ రాష్ట్రానికీ ఉన్న ప్రస్తుత దామాషా ప్రాతినిధ్యం తగ్గించరు" అని తెలిపారు.
అయితే, ప్రభుత్వం పంపిణీ చేసే ఏ బిల్లు ముసాయిదాలోనూ ఈ హామీని ప్రస్తావించలేదు.
గత పార్లమెంట్ సమావేశాల్లో.. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని పొందలేకపోయిన ఈ బిల్లును ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందోని చర్చ జరుగుతున్న సమయంలోనే సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రియా సూలే బీజేపీ ముందు చాలా సులభమైన షరతును పెట్టారని రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ అన్నారు.
"సుప్రియా సూలే చేస్తున్న డిమాండ్‌ను అమిత్ షా ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. అది ముసాయిదా బిల్లులో ప్రస్తావించలేదన్నది మరో విషయం. సుప్రియా సూలే ఒక విధంగా తన వైఖరిని తెలియజేసినట్లు అయింది" అని వినోద్ శర్మ చెప్పారు.
''అసలైన సమస్య 50 శాతం కాదు. అసలు సమస్య ఏంటంటే.. వారు లోక్‌సభ సీట్లను తమ ఇష్టానుసారం పునర్విభజిస్తారు. దీని గురించి సుప్రియా సూలే ఏమీ మాట్లాడటం లేదు. అసలు సమస్య డీలిమిటేషన్ కమిషన్‌కు ఎవరు నేతృత్వం వహిస్తారు? ఏకపక్షతను నివారించడమే అసలైన విషయం?" అని వినోద్ శర్మ అన్నారు.
"నియోజకవర్గాల పునర్విభజన విషయంలో శరద్ పవార్ ఎన్‌సీపీ, బీజేపీల మధ్య సహకారం గురించిన వార్తలు, ప్రస్తుత యుగం కేవలం రాజకీయ పార్టీల సంక్షోభం మాత్రమే కాదని, రాజకీయాల ఆలోచన విధానంలో, వాటి ప్రాథమిక ఉద్దేశంలో ఉన్న తీవ్ర సంక్షోభాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది'' అని శరద్ పవార్ ఎన్‌సీపీ వైఖరిని ఉద్దేశిస్తూ.. రాజకీయ విశ్లేషకుడు సుహాస్ పాల్షికర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
సుప్రియా సూలే ఈ ప్రకటన చేయడానికి ముందే, మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రతిపక్ష కూటమిలో మిత్రపక్షమైన ఎన్‌సీపీ (ఎస్‌పీ), ఎన్‌డీఏకు దగ్గరవుతోందన్న ఊహాగానాలు జోరుగా సాగాయి.
మంగళవారం రాత్రి, ఎన్‌సీపీ (ఎస్‌పీ) సీనియర్ నేత జయంత్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే కూడా పాల్గొన్నారు. దీంతో ఈ రెండు వర్గాలు తిరిగి ఏకం కావచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
''కొత్త డీలిమిటేషన్ బిల్లును ఇంకా ప్రవేశపెట్టలేదు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచుతారనే ప్రొవిజన్ ఉంటే.. మేం దానిని ఇండియా కూటమిలో చర్చిస్తాం. అది ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే, దానికి మద్దతు ఇవ్వడాన్ని పరిశీలిస్తాం" అని అన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తి ఉందని, ఇండియా కూటమిలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని కాంగ్రెస్‌కు కూడా తెలుసు.
చిదంబరం ఏం చెబుతున్నారు?
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు.
"ఏప్రిల్ 2026లో జరిగిన గత పార్లమెంట్ సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడంలో బీజేపీ విఫలమైంది. ఇప్పుడు దానిని తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది" అని అన్నారు.
''లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్‌ను రాజ్యాంగ (106వ సవరణ) చట్టం ద్వారా ఇప్పటికే కల్పిస్తున్నారు. అందువల్ల, మహిళా రిజర్వేషన్ కోసం ఇంతకుముందు గానీ, ఇప్పుడు గానీ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు అవసరం లేదు'' అని వ్యాఖ్యానించారు.
‘‘తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక వచ్చిన నేపథ్యంలో, బిల్లు కొత్త వెర్షన్‌ను ఆమోదం కోసం అవసరమైన ఓట్లను సంపాదించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)ల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌సీపీ (ఎస్‌పీ), డీఎంకేలు ఈ బిల్లు అసలు ఉద్దేశాన్ని ముందే అర్థం చేసుకున్నాయి. అందువల్ల అవి తమ పాత వైఖరికే కట్టుబడి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా'' అని అన్నారు చిదంబరం.
ప్రభుత్వానికి ఏ పార్టీల నుంచి మద్దతు లభిస్తుంది?
540 సభ్యులున్న లోక్‌సభలో ఎన్‌డీఏకు 293 మంది ఎంపీలున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు 360 మంది ఎంపీల మద్దతు అవసరం. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో.. ఎన్‌డీఏకు 149 మంది సభ్యులున్నారు. ఈ బిల్లు ఆమోదానికి 164 ఓట్లు అవసరం.
అయితే, ఇప్పుడు రాజకీయ పరిస్థితి మారిపోయింది. 28 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలలో ఇరవై మంది నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి, ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు.
ఇదిలా ఉండగా, లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో విభేదించింది. అది ఇండియా కూటమి సమావేశాలకు హాజరుకావడం మానేసింది. ఇటీవల, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా శివసేనలో చేరారు.
మోదీ ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే వంటి పార్టీల నుంచి, ఇండియా కూటమి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) నుంచి కూడా మద్దతు ఆశిస్తోంది.
లోక్‌సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులున్న డీఎంకేతో పాటు, లోక్‌సభలో 37 మంది, రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడా ఇప్పటికీ చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
ఓటింగ్ సమయంలో ఎంపీలందరూ సభకు హాజరైతే, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి లోక్‌సభలో ఎన్‌డీఏకు 360 ఓట్లు అవసరం అవుతాయి.
జూలై 24 తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం 117కి పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు అత్యధికం ఈ సంఖ్యనే. ఏడుగురు నామినేటెడ్ సభ్యులు, ముగ్గురు స్వతంత్ర ఎంపీలు, ఎన్‌డీఏ మిత్రపక్షాల మద్దతుతో, అధికార కూటమి రాజ్యసభలో 153 స్థానాలను సాధించాలని ఆశిస్తోంది.
అయినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీకి అంటే 164 మంది సభ్యుల సపోర్టుకు ఇంకా 11 మంది కావాల్సి ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)