సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

మహిళ, క్రికెట్, బీసీసీఐ, రికార్డులు
ఫొటో క్యాప్షన్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమించారు.
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

హర్మన్‌ ప్రీత్ కౌర్ స్థానంలో భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఓపెనర్ స్మృతి మంధాన నియమితులయ్యారు.

జింబాబ్వేతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌కు ఆమెను కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా స్మృతి మంధాన నియామకాన్ని బీసీసీఐ ప్రకటించినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

భారత మహిళా క్రికెట్‌లో కీలక క్రీడాకారిణుల్లో స్మృతిమంధాన ఒకరని, అన్ని ఫార్మాట్లలోనూ జట్టులో ఆమె కీలక పాత్ర పోషించారని బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

''అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవమున్న స్మృతి దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ఆమె నాయకత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2024, 2026 విమెన్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను గెలుచుకుంది.

టీమ్ ఇండియాలో 2013 నుంచి కొనసాగుతున్న స్మృతికి ఈ బాధ్యత తీసుకోవడానికి సరిపడా అనుభవముంది. ఇప్పటికే ఆమె భారత్ తరఫున పద్దెనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు, నాలుగు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక నుంచి ఆమె పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు'' అని బీసీసీఐ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌కు నాయకత్వం వహించే బాధ్యత దక్కడం తనకెంతో ప్రత్యేక గౌరవమని స్మృతి మంధాన చెప్పారు.

కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంతో నిబద్ధతతో జట్టుకు నాయకత్వం వహించారని స్మృతి ప్రశంసించారు.

భారత మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషిచేస్తానని స్మృతి చెప్పారు.

రికార్డుల రాణి

భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన స్టార్ ప్లేయర్‌. ఆమె ఖాతాలో అనేక ఘనతలున్నాయి. అన్ని ఫార్మాట్లూ కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళాక్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచారు.

స్మృతి ఘనతలు

  • అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి 11వేలకుపైగా పరుగులు చేశారు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు కూడా స్మృతి పేరుతోనే ఉంది.
  • ఒకే క్యాలెండర్ ఇయర్ (2024) లో 1,659 పరుగులు చేసి అత్యధిక పరుగుల రికార్డు.
  • వన్డేల్లో ఒకే క్యాలండర్ ఇయర్ (2025)లో 1000కి పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌.
  • ఒకే ఏడాదిలో (2025)లో అత్యధిక (5) సెంచరీలు చేసిన రికార్డు
  • అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌.
  • 2025లో 50 బంతుల్లోనే సెంచరీ చేసి, వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు
  • జోనల్ అండర్-19 టోర్నమెంట్‌లో 2013లో దేశీవాళీ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ.
మహిళ, క్రికెట్, బీసీసీఐ, రికార్డులు
ఫొటో క్యాప్షన్, చాలా ఏళ్లగా స్మృతి మంధాన భారత క్రికెట్‌లో కీలక క్రీడాకారిణిగా ఉంది.

అవార్డులు...రివార్డులు

స్మృతి భారత జట్టు ఓపెనర్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడం లేదా ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తు చేయడంలో ఆమె నేర్పరి.

స్మృతి 2024లో ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్నారు.

30 ఏళ్ల స్మృతి పలు ఐసీసీ అవార్డులూ గెలుచుకున్నారు.

2019లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా నిలిచారు.

2022లో ఐసీసీ 'మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డునూ అందుకుంది.

ఆమె 2018, 2021లో రెండుసార్లు 'ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు.

2019లో ప్రతిష్ఠాత్మకమైన 'అర్జున అవార్డు'ను అందుకున్నారు.

గత ఏడాది భారత్ వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 50 బంతుల్లోనే శతకం పూర్తిచేశారు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడుతూ.. వన్డేల్లో టీం ఇండియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశారు.

స్మృతి మంధాన 17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ వన్డే గేమ్‌లో డబుల్ సెంచరీ చేశారు. . వెస్ట్ జోన్ అండర్-19 టోర్నమెంట్‌లో 138 బంతుల్లో 32 ఫోర్లతో 224 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. స్మృతి ఈ సెంచరీ ఘనతను రాహుల్ ద్రవిడ్‌దే అన్నారు.

కొన్నేళ్ల కిందట రాహుల్ ద్రవిడ్‌ను స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ కలిశారు. ద్రవిడ్ తన కిట్ నుంచి ఒక బ్యాట్ స్మృతి కోసం బహుమతిగా ఇచ్చారు. ఆ బ్యాట్‌పై ద్రవిడ్ ఆటోగ్రాఫ్ కూడా చేశాడు. అండర్-19లో గుజరాత్‌పై స్మృతి ఈ బ్యాట్‌తోనే డబుల్ సెంచరీ కొట్టారు.

కొన్నేళ్ల పాటు స్మృతి మంధాన ఈ బ్యాట్‌తోనే ఆడారు. భారీగా పరుగులూ సాధించారు. ఈ బ్యాట్ ఇప్పుడు స్మృతి డ్రాయింగ్ రూమ్‌లో భాగమైంది.

మహిళ, క్రికెట్, బీసీసీఐ, రికార్డులు
ఫొటో క్యాప్షన్, అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు స్మృతి మంధాన పేరు మీద ఉంది.

సోదరుడి ఆట చూసి..

స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ సాంగ్లీ జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఆడాడు. నిజానికి శ్రవణ్ క్రికెట్ ఆడటాన్ని చూసే స్మృతి స్ఫూర్తి పొందారు. కొడుకు డ్రెస్‌ను స్మృతికి సరిపోయేలా కుట్టించి ఇచ్చేవారు ఆమె తల్లి. అదే డ్రెస్‌లో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసేవారు. ముంబైలో మొదలైన స్మృతి ఆట.. ఆమె కుటుంబం సాంగ్లీలో స్థిరపడిన తర్వాత కూడా కొనసాగింది.

స్మృతి 11 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. అనంత్ తాంబ్వేకర్ కోచింగ్‌లో కాంక్రీట్ పిచ్‌లపై ఆమె ప్రాక్టీస్ చేశారు.

ఉదయం ప్రాక్టీస్, ఆ తర్వాత స్కూల్, మళ్లీ సాయంత్రం ప్రాక్టీస్ ఇలానే సాగింది స్మృతి జీవితం. ఆ సమయంలో బంధువులు ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. అయితే స్మృతి తల్లి 'ఆటపైనే నీ దృష్టి ఉంచు' అని కూతురుకు చెప్పింది.

దాదాపు దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టులో భాగమైన స్మృతి మంధాన.. దేశ విదేశాల్లో పర్యటించినప్పటికీ సాంగ్లీతో బంధాన్ని తెంచుకోలేదు. అక్కడి పన్నీర్ గార్లిక్ బ్రెడ్, వడాపావ్ అంటే చాలా ఇష్టపడతారు స్మృతి .

ఆమెకు 2013లోనే భారత జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. 2014లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌కు స్మృతి భారత జట్టుకు ఎంపికయ్యారు.

ప్రపంచకప్ అనంతరం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి వచ్చింది. దీంతో ఆమె ఏడాది పాటు చదువుకు దూరమయ్యారు. అయితే ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా విజయం సాధించడంతో స్మృతికి భారత జట్టులో సుస్థిర స్థానం లభించింది.

ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్మృతి హాఫ్ సెంచరీ సాధించారు. మరో రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో స్మృతి సెంచరీ కొట్టారు.

2017 ప్రపంచకప్‌కు ముందు మోకాలి గాయం కారణంగా స్మృతి ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె ప్రపంచకప్ ఆడగలరా లేదా అనే సందేహం నెలకొంది. కానీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి దిగారు.

ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే స్మృతి 90 పరుగులు చేశారు.. వెస్టిండీస్‌పై సెంచరీ (106 పరుగులు) సాధించారు. దీంతో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఆ టైటిల్ భారత్ గెలవలేకపోయింది. మొత్తంగా ఈ టోర్నీ ద్వారా స్మృతి అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్క్ చూపారు.

దక్షిణాఫ్రికా టూర్‌లో 2018లో హాఫ్‌ సెంచరీ, సెంచరీలతో ఫామ్ కొనసాగించారు స్మృతి. ఇలా క్రమంగా స్మృతి మంధాన భారత మహిళల జట్టులో 'పరుగుల యంత్రం'గా పేరు తెచ్చుకున్నారు.

మహిళ, క్రికెట్, బీసీసీఐ, రికార్డులు
ఫొటో క్యాప్షన్, గత ఏడాది స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దయింది.

వ్యక్తిగత జీవితం

బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో స్మృతి మంధాన బంధం పెళ్లిదాకా వచ్చి ముగిసిపోయింది. గత ఏడాది నవంబర్ 23న స్మృతి, పలాష్‌ల పెళ్లి జరగాల్సి ఉంది. కానీ అదే రోజున వాయిదా పడింది.

పెళ్లి రోజున స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వివాహం వాయిదా వేసినట్లు అప్పట్లో ఆమె మేనేజర్ ప్రకటించారు.

తర్వాత తమ వివాహం జరగడం లేదని మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.

"నేను భారత్ తరపున ఆడాలని, గెలవాలని, వీలైనంత ఎక్కువ కాలం జట్టుకు నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. దానిపైనే ఎప్పుడూ నా దృష్టి " అని అప్పట్లో ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)