హార్ముజ్‌పైనే పీటముడి.. నిలవని ఒప్పందం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఇరాన్‌ల మధ్య జూన్ 17న కుదిరిన తాత్కాలిక ఒప్పందం (ఎంఓయూ) కొంతకాలం పాటు ఉద్రిక్తతలను తగ్గిస్తుందనే ఆశలు కలిగించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఇబ్బందుల్లో పడింది.
హార్ముజ్ జలసంధి అందరికీ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. హార్ముజ్ జలసంధిపై తమ అధికారాన్ని ఈ ఒప్పందం గుర్తిస్తోందని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలోనే, రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
భారత మాజీ రాయబారి నవదీప్ సూరి బీబీసీ వీక్లీ ప్రొగ్రామ్ 'ది లెన్స్'లో ఈ విషయంపై మాట్లాడారు.
"రెండు దేశాలు ఈ తాత్కాలిక ఒప్పందాన్ని తమదైన రీతిలో నిర్వచిస్తున్నాయి. ఇది 'అపార్థాల ఒప్పంద పత్రం'గా మారినట్లు అనిపిస్తోంది. ఈ ఎంఓయూపై హడావుడిగా సంతకాలు చేశాయి. అందుకే ఇది ఎక్కువ కాలం నిలవలేదు" అని చెప్పారు.
ఇరాన్ ప్రజలలో ఒక వర్గం ఈ ఒప్పందంపై అసంతృప్తిగా ఉందని మిడిల్‌ఈస్ట్ వ్యవహారాల నిపుణులు అష్రఫ్ జైదీ అన్నారు.
ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ వైఖరిలో ఇటీవలి ఈ భావన ప్రతిబింబిస్తోందన్నారు.

తన కఠినమైన వైఖరి వల్ల తనకు మద్దతు ఇస్తోన్న దేశాలను కూడా ఇరాన్ కోల్పోయే అవకాశం ఉందని మాజీ రాయబారి సూరి అన్నారు. ఎందుకంటే, హార్ముజ్ అంతర్జాతీయ జలమార్గంపై ఇరాన్ తన నియంత్రణను పెంచి, మళ్లీ ఇంధన ధరలు పెరిగేలా చేసిందని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని అన్నారు.
‘ది లెన్స్’ కార్యక్రమంలో భాగంగా కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేష్ శర్మ వాషింగ్టన్‌కు చెందిన విదేశాంగ విధాన నిపుణులు, సీనియర్ జర్నలిస్ట్ సీమా సిరోహితో మాట్లాడారు.
అమెరికాకు ఈ యుద్ధంలో ప్రధాన లక్ష్యం.. హార్ముజ్ జలసంధిని తెరవడమేనని, యుద్ధానికి దేశీయంగా మద్దతు తగ్గుతున్నందున ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తిరిగి చర్చలకు వస్తుందని ఆమె అన్నారు. ప్రతీకార శక్తిని ప్రదర్శించడం ద్వారా దౌత్యపరమైన చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇరాన్ ఇచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Majid Saeedi/Getty Images
అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్‌లో కనిపించిన వాతావరణం ఏం సూచిస్తుంది?
అష్రఫ్ జైదీ ఇటీవలే ఇరాన్ నుంచి తిరిగి వచ్చారు. అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల సమయంలో.. ఎంఓయూ గురించి చాలా మంది ఇరానీయులలో ఆందోళనను గమనించినట్లు అష్రఫ్ జైదీ చెప్పారు.
"ఈ ప్రాంతంలో శాంతికి ఏకైక మార్గం అమెరికా స్థావరాలను తొలగించడమేనని చాలామంది ఇరానియన్లు నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితిలో, 'ప్రస్తుత ప్రభుత్వం రాజీకి బదులుగా యుద్ధంతో ముందుకు వెళ్లాల్సింది' అని వారు భావిస్తున్నారు" అని చెప్పారు.
"అక్కడి సమాజంలోని ఒక వర్గం యుద్ధానికి సిద్ధంగా ఉంది. కూడళ్లలో ట్రంప్‌ను హత్య చేయాలని నినాదాలు చేయడం నేను విన్నాను. బలప్రయోగం చేయకుండా అమెరికా మనల్ని వదిలిపెట్టదని వారు అర్థం చేసుకోవడమే దీనికి కారణం" అని తెలిపారు.
కొంతమంది ఈ యుద్ధాన్ని కోరుకోరు. కానీ ఈ యుద్ధాన్ని అమెరికా తమపై రుద్దిందని, తాము పోరాడకపోతే దేశాన్ని బాహ్య శక్తులు ఆక్రమించుకుంటాయని వారు నమ్ముతున్నారు.
సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ లిఖితపూర్వక ప్రకటనలోనూ అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామనే ప్రస్తావన ఉందని, ఇది అక్కడి రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని జైదీ అన్నారు.
'ట్రంప్‌ను హత్య చేయాలి' అని డిమాండ్ చేస్తూ నినాదాలు, బ్యానర్లు కనిపించడాన్ని బీబీసీ మానిటరింగ్ కూడా చూసింది.
మరోవైపు యుద్ధం ఆగిపోవాలని, అమెరికాతో యుద్ధంలో గెలవలేమని ఇరాన్‌లోని ఒక వర్గం భావిస్తోందని మాజీ రాయబారి నవదీప్ సూరి అన్నారు.
అయితే, తమ నాయకుడిని హత్య చేసిన దేశంతో రాజీకి ఆస్కారం లేదని అక్కడి "అతివాద బృందాలు" అంటున్నాయి.
అదే సమయంలో, తమ ప్రస్తుత సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం పట్ల ఇరాన్ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, దేశానికి, యుద్ధానికి ఆయన భద్రత ముఖ్యమని వారు విశ్వసిస్తున్నారని అష్రఫ్ జైదీ అన్నారు.
అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజల సంఖ్యను బట్టి చూస్తే, అక్కడి ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ఎంతలా పాటిస్తున్నారో తెలుస్తుందన్నారు.
''హార్ముజ్ జలసంధిపై సుంకాలు విధించడం లేదా దాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం ద్వారా.. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటి వరకు ఇరాన్‌కు ఇస్తోన్న మద్దతును ఆ దేశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరాన్ చిన్న దేశమైనప్పటికీ.. అమెరికాతో పోరాడుతుందని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ పోరాటం హార్ముజ్ జలసంధి వద్దకు వచ్చి ఆగింది. ఇది అందరినీ ప్రభావితం చేస్తోంది'' అని అష్రఫ్ జైదీ చెప్పారు.

యుద్ధ లక్ష్యం ఇప్పుడు హార్ముజ్‌కు పరిమితమైందా?
ఇటీవల ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఎంఓయూలో ఉన్న లోపాలేనని ఈజిప్ట్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు భారత రాయబారిగా పనిచేసిన నవదీప్ సూరి అన్నారు.
అంతేకాకుండా, హార్ముజ్ జలసంధి కారణంగా ఇరాన్‌కు ఉన్న ప్రయోజనం చెక్కుచెదరలేదని, యుద్ధం దృష్టంతా ఇప్పుడు ఇరాన్‌లో పాలన మార్పు, దాని అణు కార్యక్రమం నుంచి హార్ముజ్ దిగ్బంధనం వైపు మారుతున్నట్లు కనిపిస్తోందని వారు చెప్పారు.
''అమెరికా గతంలో పేర్కొన్న లక్ష్యాలను, అణు కార్యక్రమానికి ఏమి జరుగుతుందనే విషయాన్ని ఈ రోజు మనం మరచిపోయాం, పాలన కూడా మారలేదు. ఇప్పుడు వారు ఎలాగైనా హార్ముజ్‌లోని పరిస్థితిని ఫిబ్రవరి 28కి ముందున్న స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.అప్పుడు ఓడలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేవి. ఎటువంటి పన్నులు విధించలేదు'' అని నవదీప్ సూరి తెలిపారు.
హార్ముజ్ కారణంగా ఇరాన్‌కు లభించిన వ్యూహాత్మక ప్రయోజనం ఇప్పటికీ ఉందని కూడా ఆయన అన్నారు.
మరోవైపు, ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నందున.. చమురు ధరలను తగ్గించుకునేందుకు హార్ముజ్ జలసంధిని తెరవడమే ఇప్పుడు ఈ ఘర్షణకు చెందిన అమెరికా ప్రధాన లక్ష్యమని జర్నలిస్ట్ సీమా సిరోహి అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యం ఇప్పుడు అమెరికా లక్ష్యం నుంచి తప్పిపోయిందని, దీన్ని తర్వాత చర్చించనున్నారని తెలిపారు.
ఎంఓయూలో చాలా నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని మాజీ రాయబారి నవదీప్ సూరి, జర్నలిస్ట్ సీమా సిరోహి తెలిపారు.
"ఆ సమయంలో ట్రంప్ ఎలాగైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకున్నారు. అందుకే ఇదంతా హడావుడిగా జరిగిపోయింది. దీని కారణంగా, ఎంఓయూలోని విషయాలను ఇరాన్ తనకు అనుకూలమైన రీతిలో మార్చుకుంది. అది దానికి ప్రయోజనాన్ని చేకూర్చింది. ఒకవైపు తామే గెలిచామని ఇరాన్ చెప్పడం మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా కూడా విజయం సాధించామని ప్రకటించుకుంది. కానీ, అసలు సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి" అని నవదీప్ సూరి అన్నారు.
''ప్రధాన వివాదం హార్ముజ్ జలసంధికి సంబంధించి ప్రొవిజన్ (పారాగ్రాఫ్ 5) విషయంలో ఉంది. దానిని అమెరికా, ఇరాన్‌లు భిన్నంగా చెబుతున్నాయి'' అని ఆయన చెప్పారు.
ఎంఓయూ విషయమై, మార్గాన్ని పూర్తిగా తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించిందని అమెరికా చెబుతుండగా, తమ నియంత్రణలో, తాము నిర్దేశించిన మార్గంలోనే తెరుస్తామని ఇరాన్ చెబుతోంది.
ఇరాన్ ఇప్పుడు తన అనుమతి లేదా సహకారం లేకుండా ప్రయాణించే నౌకలపై చర్యలు తీసుకోవడం ద్వారా తన వాదనలను బలపరుస్తోంది. ఇలాంటి దాడుల వల్ల కొంతమంది భారత పౌరులు కూడా ప్రభావితులయ్యారు.
మరోవైపు, అమెరికా ఈ దాడులను చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇరాన్‌పై దాడి చేస్తోంది.
ఇరు పక్షాలు ఇప్పటికీ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నాయని, అయితే అది ఏ షరతులపై జరుగుతుందనేది ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన విషయమని నవదీప్ సూరి అన్నారు.
ట్రంప్ సలహాదారులు ఇరుపక్షాలను ఎలాగైనా తిరిగి చర్చల వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో ఇరాన్ ముఖ్య సలహాదారు ఘాలిబాఫ్ కూడా చర్చల గురించి సూచించారని జర్నలిస్ట్ సిరోహి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ యుద్ధ విషయంలో భారత దౌత్య వ్యూహం సరైనదేనా?
ఈ విషయంలో భారత్ చాలా గట్టిగా మాట్లాడాలని, దేశ ప్రయోజనాలను అలాగే అంతర్జాతీయ చట్టాన్ని, నైతిక విలువలను, సిద్ధాంతాలకు మద్దతును స్పష్టంగా తెలియజేయాలని మాజీ రాయబారి నవదీప్ సూరి అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా దాడిని భారత్ ఖండించి ఉంటే, బహుశా ఈ యుద్ధం ప్రస్తుత ప్రభావంపై లేదా దాని భవిష్యత్ పరిణామాలపై భారత్ కొంత ప్రభావం చూపి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
''ఈసారి ఈయుద్ధంలో ఎటో ఒక వైపు ఎంచుకోవాల్సి వస్తే, అది ఇజ్రాయెల్, అమెరికా వైపే. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి జరిగినప్పుడు, మనం దానికి ఖండించాల్సింది. మనం అలా చేయలేదు. బహుశా దానివల్ల కొంత విశ్వసనీయత తగ్గింది'' అని ఆయన అన్నారు.
'' మనం దౌత్య రంగంలో యాక్టివ్‌గా లేకపోవడం వల్లనో లేదా ఒక వర్గాన్ని ఎంచుకోవడం వల్లనో, బహుశా పాకిస్తాన్ కూడా ప్రయోజనం పొంది ఈ రంగంలో తన దౌత్యపరమైన ఎత్తుగడ వేసింది" అని చెప్పారు.
ఇటీవల జరిగిన అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ పంపిన ప్రతినిధి బృందంలో కనీసం ఉపాధ్యక్ష స్థాయి సభ్యులతో ఉండాల్సిందని సూరి అభిప్రాయపడ్డారు. అయితే, ప్రధాని మోదీకి ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రయాణాల కారణంగా ఆయన పాల్గొనడం కష్టమైందని ఆయన అన్నారు.
అయితే, ఇతర దేశాలతో పోలిస్తే ఇంధన సంక్షోభాన్ని భారత్ చాలా బాగా నిర్వహించిందని సూరి విశ్వసిస్తున్నారు.
"నేను దౌత్యాన్ని ఇంధన దృక్పథంలో నుంచి కూడా చూశాను. మనం నిర్మించుకున్న సంబంధాలతో, మన వనరులను వేగంగా విస్తరించుకుని, ఇంధన సంక్షోభాన్ని చాలా బాగా నిర్వహించాం. కానీ, వ్యూహాత్మక పెట్రోలియం ఉత్పత్తిని రెట్టింపు లేదా మూడింతలు చేయాల్సి ఉంటుంది" అని తెలిపారు.
ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో ద్రవ్యోల్బణం సమస్య ప్రభుత్వ నియంత్రణకు మించినదని మాజీ రాయబారి సూరి అన్నారు. చాలా కాలం పాటు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు భారాన్ని మోశాయని, ఆ తర్వాత ఇంధన ధరలు పెంచాయని ఆయన చెప్పారు. అలా చేయకపోయి ఉంటే, ఆ కంపెనీలు దివాలా తీసేవని నవదీప్ సూరి తెలిపారు.
మర్చంట్ నేవీలోని భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వ వైఖరితో సూరి కూడా ఏకీభవిస్తున్నారు. సంఘర్షణ ప్రాంతాల మీదుగా వెళ్లే ఓడలలో ప్రయాణించవద్దని నావికులకు ప్రభుత్వం కేవలం సలహాలు మాత్రమే జారీ చేయగలదని ఆయన అన్నారు. అయితే, ఇది కంపెనీల ఇష్టమని తెలిపారు.
ఈ యుద్ధంలో భారత్ ప్రయోజనాలు చాలా లోతుగా ముడిపడి ఉన్నాయని జర్నలిస్ట్ సీమా సిరోహి అన్నారు. ''ప్రాంతీయ సముద్ర వాణిజ్యంలో పెద్ద సంఖ్యలో భారతీయ నావికులు, సిబ్బంది ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా, భారత్ ఇంధన భద్రత గల్ఫ్ ప్రాంత స్థిరత్వంపై ఆధారపడి ఉంది. అందువల్ల, భారత్ మరింత చురుకైన దౌత్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది'' తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































